తెలుగుదేశం పార్టీ నేత తోట త్రిమూర్తులు వైఎస్సార్సీపీలోకి చేరిపోయారు. తోట, 2019 ఎన్నికలలో టిడిపి తరఫున రామచంద్రపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వేణు గోపాల కృష్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే, తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సిపిలో చేరిపోవడం వెనుక పలు రకాల కారణాలు వినిపిస్తున్నాయి. పైగా తన చిరకాల ప్రత్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్న పార్టీలోకి తోట త్రిమూర్తులు ఎందుకు వెళ్లాడా అన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కి భయపడే తోట వైఎస్ఆర్ సిపి లోకి వెళ్లాడని ఒక విశ్లేషణ వినిపిస్తోంది.
త్రిమూర్తులు, సుభాష్ చంద్రబోస్ ల మధ్య వైరం ఈనాటిది కాదు. దాదాపు ముప్పై ఏళ్లుగా రామచంద్రపురం కేంద్రంగా వీరి మధ్య ఒక తరహా యుద్ధమే కొనసాగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన త్రిమూర్తులు వెంట ఆ వర్గం మొత్తం నడిస్తే, శెట్టి బలిజ సామాజిక వర్గం పిల్లి సుభాష్ చంద్రబోస్ కి దన్నుగా నిలిచింది. ఒక 10 ఏళ్లు రామచంద్రపురం నియోజకవర్గానికి తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఉంటే, ఆ తర్వాత ఒక పది ఏళ్ళు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే 2012 ఉప ఎన్నికలలో, రాష్ట్రం మొత్తం వైయస్ జగన్ హవా నడిచినా, జగన్ పార్టీ అభ్యర్థి అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు అప్పట్లో కాంగ్రెస్లో ఉన్న తోట త్రిమూర్తులు చేతిలో పరాభావం కలిగింది. ఇక 2014లో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ వర్క్ ఔట్ కావడంతో అటు కాపుల ఓట్లు బిసిల ఓట్లు పడి, తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ 2019 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఓడి పోవడమే కాకుండా, పిల్లి మంత్రి కావడం, పిల్లి కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం – ఇవన్నీ తోట త్రిమూర్తులు కు ఇబ్బందిగా పరిణమించాయి అని వార్తలు కూడా వచ్చాయి. ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేసే విధంగా వైఎస్ఆర్సిపి పాలన ఉండవచ్చన్న అభిప్రాయాలు, పిల్లి సుభాష్ చంద్రబోస్ తన ఉప ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని రాజకీయంగా కక్ష సాధించే అవకాశం ఉందన్న ఊహాగానాలు తోట త్రిమూర్తులు లో భయాన్ని కలిగించాయని, పైగా తన వ్యాపార బంధాలు ఉన్న నేతలు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉండడం తో వైఎస్ఆర్సిపిలో చేరిపోవడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే తోట త్రిమూర్తులు అభిమానుల్లో మాత్రం ఆయన వైఎస్సార్సీపీలో చేరడం పై మిశ్రమ స్పందన వస్తోంది. దశాబ్దాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ కి గట్టిపోటీ ఇచ్చిన తోట త్రిమూర్తులు ఆయన ఉప ముఖ్యమంత్రి కాగానే రాజకీయ కక్ష సాధింపు లకి భయపడి రాజీ పడిపోవడం ఆయన అభిమానులకు రుచించడం లేదు. మరి వైఎస్ఆర్సిపి ఒరలో ఈ రెండు కత్తులు ఎలా ఇముడుతాయో వేచి చూడాలి.