ఇసుక ఎందుకు ఆపేశారు..? పేదలు ఇబ్బంది పడుతున్నారని .. జనసేన అధినేత ఆరోపిస్తే.. ఆయనను… పెయిడ్ ఆర్టిస్టు అని ఎగతాళి చేస్తున్నారు అధికార పార్టీ నేతలు..!
టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు..! ఇదేం ఫ్యాక్షనిజం..! అంటే.. అప్పట్లో మీరు చేశారుగా.. అని మరో తరహా ఎదురుదాడి చేస్తున్నారు అధికార పార్టీ నేతలు..!
ఇప్పుడు… అవినీతి, అక్రమాలను బయట పెడుతున్న మీడియాపైనా… అదే ముద్ర వేస్తున్నారు. బంధుత్వాలు, ఇతర ఆరోపణలు చేసి తప్పించుకుంటున్నారు. పోలవరం విషయంలో అదే జరుగుతోంది. రివర్స్ టెండరింగ్లో నిబంధనల అతిక్రమణపై ఈనాడు పత్రికలో వచ్చిన కథనంపై.. మంత్రి అనిల్ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు కానీ… ఎక్కడా కనీసం అనుమానాలు తీర్చే ప్రయత్నం కూడా చేయలేదు.
పోలవరం రివర్స్ టెండరింగ్ కు కాంట్రాక్టర్ల ఎంపికలో ముందే అవినీతి జరిగిందని.. ఏపీ సర్కార్ వ్యవహారశైలితో తేటతెల్లమవుతోంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల నిబంధనలను మార్చడమే కాకుండా… కాంట్రాక్టర్ను ఎంపిక చేసిన తర్వాత నిబంధనలను ఖరారు చేసే విధంగా… వెసులుబాటు కల్పించుకోవడంలోనే అసలు లోగుట్టు బయటపడింది. దీనిపై ఈనాడు కథనం ప్రచురించడంతో ఉలిక్కి పడిన ప్రభుత్వం… మంత్రి అనిల్ కుమార్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. అందులో.. ఈనాడు ప్రచురించిన కథనంలో ఉన్న ఆరోపణలకు ఒక్కటంటే.. ఒక్క క్లారిఫికేషన్ లేదు. కానీ.. ఈనాడుపై బంధుత్వాలు … ఇతర కారణాలు చూపి.. దూషించారు.
70 శాతానికిపైగా పూర్తయిన అతి పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయాలంటే.. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్న సంస్థలు కావాలి. కానీ డ్యామ్ భద్రతను లెక్కలోకి తీసుకోకుండా.. ఎవరికి పడితే వారికి.. కాంట్రాక్టు ఇచ్చే విధంగా నిబంధనలు మార్చిన వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ అంశాలపై… ప్రభుత్వం వివరణ ఇస్తుందని అందరూ అనుకున్నారు కానీ.. ఆ అంశాలను లెవనెత్తిన వారిపై ఆరోపణలు చేసి.. వారిని తిట్టి… ప్రస్తుతానికి పని కానిస్తోంది. ఇవి ప్రజల అనుమానాలను తీర్చకపోగా… మరింత పెంచేలా ఉన్నాయి.