ఒక ప్రభుత్వాన్ని జడ్జ్ చేయడానికి వంద రోజులు సరిపోదనీ, కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పరిపాలనపై ఏమాత్రం దృష్టిపెట్టలేదని ప్రజలూ అనుకుంటున్నారు, భాజపా అభిప్రాయమూ అదే అన్నారు ఆ పార్టీ నేత సుజనా చౌదరి. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ఏ ప్రభుత్వమైనా ఏదైనా కొత్త పాలసీ తీసుకుని రావాలంటే, అంతకుముందు అమల్లో ఉన్న పాలసీని అమల్లో ఉంచి మార్పులకు శ్రీకారం చుడతారనీ, కానీ దానికి భిన్నంగా పాలనను స్తంభింపజేసి పాలసీల మీద వైకాపా సర్కారు చర్చిస్తోందని విమర్శించారు.
గవర్నర్ ని కలిసిన బృందం గురించి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కోవర్టులు, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల కంటే చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నవారు ఎక్కువమంది ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపై సుజనా స్పందించారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న విజయసాయి రెడ్డి విజ్ఞతకే దాన్ని వదిలేస్తున్నా అన్నారు. భాజపాని ఎలా నడుపుకోవాలో తమకు తెలుసనీ, ఆయన వారి పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టుకుంటే మంచిది అనేది తన అభిప్రాయమన్నారు. స్థాయి దిగి అనేక అంశాలపై వారు చేస్తున్న వ్యాఖ్యలు మంచివి కావన్నారు. రాజధాని విషయంలో రైతులు భయాందోళనలతో ఉన్నారనీ, వారు వచ్చి కష్టాలు చెప్పుకుంటేనే తాను జోక్యం చేసుకుని గవర్నర్ ని కలిశా అన్నారు. రాజధాని అమరావతి నుంచి మారదనీ, జగన్ సర్కారు చెబుతున్నట్టు రివర్స్ టెండరింగ్ కూడా అంత సులువుగా జరిగేది కాదని మరోసారి చెప్పారు.
రాజధాని విషయంలో బొత్స సత్యనారాయణో, సర్వశ్రీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. విజయసాయి రెడ్డి పెద్దవారు, రాజ్యసభ సభ్యులు కాబట్టి ఆయన్ని సర్వశ్రీ అని సంభోందించా అని ప్రత్యేకంగా మరోసారి అన్నారు. మొత్తానికి, భాజపాలో చేరినా కూడా టీడీపీకి బి టీమ్ గా ఉంటున్నారనే విజయసాయి వ్యాఖ్యలు సుజనాని బాగానే హర్ట్ చేసినట్టున్నాయి. అందుకే, ఆయన వ్యాఖ్యలపై స్పందించనూ అంటూనే స్పందించేస్తున్నారు! ఇప్పుడు ఏకంగా సర్వశ్రీ అని బిరుదు ఇచ్చారు! మరి, దీనిపై విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయనకి ట్విట్టర్ ఉంది కదా. ఏదో ఒకటి అనకుండా ఎలా ఉంటారు?