అమరావతి డెడ్ ఇన్వెస్ట్ మెంట్. కట్టవద్దని చంద్రబాబుకు చెప్పా..! ఇప్పుడేమయింది..?. అంటూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అనేక మంది రాజకీయ , వ్యాపార, వాణిజ్య, మీడియా ప్రముఖులు కూడా.. అమరావతి నిలిపివేయడం.. ఓ చెడ్డ నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. బిజినెస్ మ్యాగజైన్లలో ఎడిటోరియల్స్ రాస్తున్నారు. అయినప్పటికీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ సందర్భం లేకపోయినా… ఈ అంశాన్ని ప్రస్తావించి.. తాను చెప్పాల్సింది చెప్పారు. తాను చంద్రబాబుకే సలహా ఇచ్చానన్నారు.
కట్టవద్దని చంద్రబాబుకే కేసీఆర్ చెబితే.. ఇంక… చిన్న తమ్ముడిగా మారిపోయిన .. ప్రస్తుత సీఎం జగన్‌కు చెప్పకుండా ఉంటారా అన్నది అసలు ప్రశ్న. చెప్పారని… ఆయన సలహాలతోనే.. అమరావతి నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి నిలిపి వేశారని… ఇప్పటికే ఏపీలో చర్చ ప్రారంభమయింది. అమరావతి నిలిపివేస్తే ఎవరికి లాభమో.. సులువుగా ఎవరికైనా అర్థమయిపోతుంది. బహుశా..అంతా అయిపోయిన తర్వాత.. కేసీఆర్ మళ్లీ అదే శాసనసభలో.. జగన్ చెప్పి చెప్పి.. తానే అమరావతి నిర్మాణం నిలిపివేయించానని… చెప్పుకున్నా ఆశ్చర్యం లేదన్న భావన ఏపీ ప్రజల్లో ప్రారంభమయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై.. ఇప్పటికే అనేక రకమైన విమర్శలు వస్తున్నాయి.
గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలే కాదు… అభివృద్ధి పనులన్నింటినీ నిలిపివేశారు. ఏపీ ఆదాయాన్ని పడిపోయేలా చేశారు. ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఓ రోల్ మోడల్ నగరంగా మారుతుందని.. అంచనా వేసిన అమరావతిని నిలిపివేశారు. తెలంగాణలో ప్రాజెక్టులపై అవినీతి ఆరోపణలు చేస్తేనే తెలంగాణ సీఎం సొంత రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయవద్దని విపక్షాలను విమర్శిస్తారు. కానీ ఏపీకి ఆర్థిక నాడిగా మారుతుందని భావిస్తున్న అమరావతి విషయంలో మాత్రం… వ్యతిరేక ప్రకటనలు చేస్తారు. ఏపీ నుంచి కనీసం స్పందించేవారు కూడా లేరన్న అభిప్రాయం ఏర్పడుతోంది.