సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో నిజాం కన్నా ఘోరమైన పాలన జరిగింది. అంటే… నిజామే మెరుగైన పాలన అందించారన్నమాట. అంతే కాదు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య వల్ల … తెలంగాణ ఇండియాలో విలీనమైందమో కానీ.. దాని వల్ల తెలంగాణ నాలుగేళ్ల పాటు నరకం అనుభవించింది. అప్పుడు కూడా నిజాం పాలన కన్నా ఘోరంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. చరిత్రలో మీకు ఇలాంటివి కనిపించకపోవచ్చు.. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పే చరిత్ర ఇలాగే ఉంటుంది. నిజాం పాలన గొప్పదని.. ఇంత వరకూ ఎవరూ చెప్పి ఉండరు.. ఒక్క కేసీఆర్ తప్ప..!
నిజాం పాలన గొప్పదైతే … అప్పటి పోరాటయోధులు ఎవరు..?
నిజాంకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం గురించి… అందులోని వీరుల గురించి కథలు కథలుగా.. తెలంగాణ సమాజం చెప్పుకుంటూ ఉంటుంది. కొన్ని వందల మంది పోరాట గాధలు… బయటకు రాకుండానే మరుగునపడిపోయాయి. తరాలు మారే్ కొద్దీ.. ఆ పోరాటాలు తెలంగాణ యువతకు స్ఫూర్తినిచ్చాయి. మలి దశ తెలంగాణ ఉద్యమానికి అవి కూడా ఊపిరి పోశాయి. కానీ ఇప్పుడా.. మలి దశ ఉద్యమ ఫలాలు పొందుతూ.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్ మాత్రం… నిజాంపై పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న వారి నిజాయితీనే శంకిస్తున్నారు. నిజాం పాలన గొప్పదని.. అదే పనిగా పొగుడుతున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే అదే మాట అన్నారు. అంతే కాదు.. వల్లభాయ్ పటేల్ సైనిక చర్య కూడా… తప్పన్నట్లుగా మాట్లాడారు. నిజాం పాలనను పొగిడటం ద్వారా.. ఆ రోజుల్లో… రజాకార్లపై పోరాడిన .. అసువులు బారిన వారిని అవమానిస్తున్నారు. ఇప్పుడు.. ముస్లిం ఓట్ల కోసం… కేసీఆర్.. ఈ పని చేస్తున్నారు. అయినప్పటికీ.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా.. కేసీఆర్ చేస్తున్నది తప్పు అని విమర్శించలేని పరిస్థితి. ఎదుగుతున్న బీజేపీని… చరిత్రను వక్రీకరించడం ద్వారా… అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా… ఎవరికీ పట్టడం లేదు.
నిజాం కన్నా ఘోరమైన సమైక్యపాలనలో కేసీఆర్ కూడా మంత్రే కదా..!?
సమైక్యరాష్ట్రంలోనే తెలంగాణ నిజాం కాలం కన్నా దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొందని… కేసీఆర్ చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన ఆ సమైక్యపాలనలో.. తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు. మంత్రిగా కూడా చేశారు. మంత్రి పదవి రానందునే… సొంత పార్టీ పెట్టి.. తెలంగాణ ఉద్యమం నడిపారు. ఈ విషయంలో.. ఎలాంటి శషభిషలు ఎవరికీ లేవు. మంత్రి పదవి ఇవ్వనందుకే… నిజాం కన్నా… ఘోరమైన పాలన సమైక్య రాష్ట్రంలో కనిపించిందా..? లేక.. తాను మంత్రిగా ఉన్నప్పుడే అలా ఫీలయ్యారా..? అనేది కీలకం.
అంతగా తెలంగాణకు అన్యాయం చేస్తే ఇప్పుడు ఆంధ్ర కోసం ఎందుకు ఆరాటం..!
ఉద్యమకాలంలో.. ఆంధ్రుల్ని విలన్లను చేయడానికి ఎన్ని రకాల తిట్లు తిట్టారో.. అన్నీ తిట్టేసిన సీఎం కేసీఆర్… తెలంగాణ కాలి గోటికి కూడా.. ఆంధ్ర సరిపోదని… ఈసడించారు. తెలంగాణ విడిపోక ముందు ఎంతగా… విమర్శించారో.. విడిపోయిన తర్వాతా.. అదే పరిస్థితి. కానీ అనూహ్యంగా… ఏపీలో… తాను చెప్పే మాటలు వినే ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏపీపై .. అక్కడి ప్రజలపై ఎక్కడ లేని అభిమానం ప్రదర్శిస్తున్నారు. నిజాం కన్నా.. ఘోరమైన పాలనలు మర్చిపోయారు. తన పార్టీ పీక నొక్కడానికి ప్రయత్నించిన వైఎస్ కుమారుడి గొప్పతనం గురించి.. ఆయన నిజాయితీ గురించి ఇప్పుడు కథలు కథలుగా చెబుతున్నారు.
ఉమ్మడి ప్రాజెక్టు పేరుతో ఏపీతో ఖర్చు పెట్టించడానికేనా..?
తెలంగాణ సీఎం కాళేశ్వరం పేరుతో రూ. లక్షన్నర కోట్ల అప్పు చేశారు. అంత అప్పు చేసిన ప్రాజెక్టు పూర్తయిందని చెబుతున్నారు. కానీ ఇప్పటికీ… దాని వల్ల ఎన్ని ఎకరాలకు నీరందించారో మాత్రం చెప్పలేని పరిస్థితి. ఎత్తిన పోసిన నీళ్లు కరెంట్ ఖర్చు తో మళ్లీ దిగువకు పంపాల్సిన పరిస్థితి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కాళేశ్వరంకు పెట్టిన దాంట్లో సగం మొత్తం వెచ్చిస్తున్నారు. ఇన్ని చేసినా… కోటి ఎకరాలకు సాగునీరు రావనుకుంటున్నారేమో కానీ… ఏపీతో కలిసి.. గోదావరి నీటిని శ్రీశైలంకు పంపే ప్రాజెక్టుకు .. మరో లక్షన్నర కోట్లతో రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ భూభాగంలో కట్టే ఈ ప్రాజెక్టుకు.. ఏపీ నుంచి సగం వాటా పొందడమే లక్ష్యంగా కేసీఆర్ ఈ పావులు కదుపుతున్నారు. ఆయన పని పూర్తయిన తర్వాత… గతంలో దోచుకున్నదానికి పరిహారం అని చెప్పి… ఆంధ్రుల్ని మళ్లీ తిట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఆంధ్రులంటే.. అంత అలసైపోయారు మరి.. !