వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైతే… అసలు విషయం బయట పడే వరకూ… ఆత్మహత్య అని సాక్షి మీడియా.. వైసీపీ నేతలు ప్రచారం చేశారు. చివరకు పోస్టుమార్టంకు తీసుకెళ్లిన తర్వాత మాత్రమే… హత్య అని అంగీకరించారు. అయితే.. ఇప్పుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాధమిక ఆధారాలు, పోస్టుమార్టం ప్రాధమిక నివేదిక ఉన్నప్పటికీ… వైసీపీ నేతలు… జగన్ మీడియా మాత్రం…కోడెల శివప్రసాదరావుది హత్య అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో ఎక్కడో కెన్యాలో ఉన్న ఆయన కుమారుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రసారాలు చేయడం.. ఆరోపణలు చేయడం..ఇందులో కొనసమెరుపు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్యేనని పోస్టుమార్టం రిపోర్టులో నిర్ధారణ అయింది. ఉదయం 11.30 గంటలకు ఇంట్లోని తన గదిలో కోడెల బట్టలు ఆరేసే తాడుతో.. ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. 11.50కి ఇంటికి సమీపంలోనే బసవతారకం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కోడెల చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. బసవతారకం ఆస్పత్రి వ్యవస్థాపనలోనూ..ఆ ఆస్పత్రి ఎదుగుదలలోనూ.. కోడెలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ఆస్పత్రిలోనే ఆయన చనిపోయారు. కోడెలది ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఇంట్లో క్లూస్ టీం.. ఆధారాలు సేకరించింది. రెండు వారాల కిందట కోడెలకు అస్వస్థత అని ప్రచారం జరిగింది. కానీ… అప్పుడు కూడా ఆయన ఆత్మహత్యాయయత్నం చేసుకున్నారని చెబుతున్నారు. వారాల కిందట నిద్రమాత్రలు మింగి కోడెల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని.. సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించడంతో.. అప్పట్లో ముప్పు తప్పిందంటున్నారు.
కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలినా… వైసీపీ జగన్ మీడియా మాత్రం.. అనుమానాస్పద మృతి అని కథనాలు ప్రసారం చేస్తూండటంతో.. చాలా మందికి.. వైఎస్ వివేకా కేసు గుర్తుకు వస్తోంది. వైఎస్ వివేకా హత్యకు గురైతే.. ఆత్మహత్య అని నమ్మించేందుకు చేసిన ప్రయత్నాలు.. సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. విజయసాయిరెడ్డి సహా.. అందరూ ఆత్మహత్య అంటూ చేసిన ప్రకటనలను..పోస్టు మార్టం తర్వాత మార్చుకున్న వైనం గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మహత్య అని స్పష్టంగా తెలుస్తున్నా..హత్య అని చెప్పడానికి వైసీపీ, వారి మీడియా గీత కూడా దాటిపోతోంది. అందుకే.. అందరూ ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.