కొత్త అసెంబ్లీ భవనం కోసం ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చాలని తెరాస సర్కారు అసెంబ్లీలో తీర్మానించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్లపై న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చడానికి వీల్లేదని స్పష్టంగా చెప్పేసింది. ఎర్రమంజిల్ లాంటి వారసత్వ సంపద భవన నిర్మాణాల్లో మార్పులూ చేర్పులూ చెయ్యాలంటే నిబంధనలు తప్పక పాటించాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది. ఎర్రమంజిల్ విషయంలో ఆ నిబంధనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండానే జూన్ 18 అసెంబ్లీలో తీర్మానం చేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. వారసత్వ భవనాలను కూలగొట్టడమంటే ప్రజల సంపదను ధ్వంసం చేయడమేననీ, హైదరాబాద్ చారిత్రక ప్రత్యేకతను దెబ్బతీయడమే అవుతుందని వ్యాఖ్యానించింది.
నిజానికి, అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంపై కోర్టు స్పందించవచ్చా… అసెంబ్లీ వ్యవహారాలపై జోక్యం చేసుకోవచ్చా… ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై న్యాయ సమీక్షకు ఆస్కారం ఉందా అనే చర్చపై కూడా కోర్టు స్పందించింది. ఇలాంటి సందర్భంలో న్యాయపరమైన జోక్యం పరిమితమే అని చెబుతూనే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జోక్యం చేసుకోవచ్చు అంటూ బిజ్ మోహన్ లాల్ వెర్సెస్ యూనియన్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చూపించింది. చట్టాలకు లోబడి కేబినెట్ నిర్ణయాలు లేకపోతే జోక్యం తప్పదని స్పష్టం చేసింది. పురాతన కట్టడాలు, వారసత్వ భవనాలను కాపాడాల్సిన ప్రభుత్వంపై ఉంటుందని వ్యాఖ్యానించింది.
ఈ కూల్చివేతలు కట్టడాలపై ఇప్పటికే ప్రజల్లో కూడా కొంత వ్యతిరేక చర్చే ఉంది. రాష్ట్రంలో అప్పుల్లో ఉందని చెబుతూ, ఉన్న భవనాల్ని కూలగొట్టుడూ కట్టుడూ అవసరమా అనేది చాలామంది అభిప్రాయం. మున్సిపల్ ఎన్నికల్లో దీన్ని ప్రధానంగా ప్రచారం చేసుకునే అవకాశం వారికి చిక్కినట్టే. కోర్టు తీర్పు తెరాసకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. ఈ నేపథ్యంలో విపక్షాలు విమర్శలు అందుకున్నాయి. ముఖ్యంగా జీహెచ్ ఎంసీ పరిధిలో ఇది మంచి ప్రచారాస్త్రమే అవుతుంది. ఈ విమర్శల్ని ఎదుర్కోవాలంటే ఏదో ఒక యాంగిల్ ని తెరాస పట్టుకోవాల్సి ఉంది. కోర్టు తీర్పుపై టి. సర్కారు స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం అనే అంశం మీద తెరాస ఎదురుదాడికి దిగుతుందేమో మరి!