టచ్ లో ఉంటున్నారు… ఈ మాట తెరాస నేతల గురించి భాజపా నేతలు చెబితే కొంత నమ్మశక్యంగా ఉంటుంది! కాంగ్రెస్ నేతలు మాతో టచ్ లో ఉంటున్నారని భాజపా నేతలు చెప్పినా నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగానీ, తెరాస నేతలు తమలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారనీ టచ్ లో ఉంటున్నారని టి. కాంగ్రెస్ నేతలు చెబితే… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు నమ్ముతారు? అవునా… తెరాస నాయకులు మన పార్టీకి టచ్ లో ఉన్నారా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నా ఆశ్చర్యం లేదు! టచ్ లో ఉంటున్నారు… అనే ఈ వ్యాఖ్య మీద అందరిలోనూ ఇంత క్లారిటీ ఉంటే, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే వ్యాఖ్య చేశారు!
సూర్యాపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… త్వరలోనే తెరాసలో విస్ఫోటం తప్పదని జోస్యం చెప్పారు. మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు షకీల్, రసమయి బాలకిషన్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి… ఈ మధ్య తెరాస అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతల వ్యాఖ్యలను గమనిస్తే పరిస్థితి అర్థమౌతుందన్నారు! తెరాసలో చాలామంది నాయకులు తమతో టచ్ లో ఉన్నారనీ, తెరాసలో అసంతృప్తులు తమవైపే చూస్తున్నారని ఉత్తమ్ చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. పోలీసుల సాయంతో తమ పార్టీ కార్యకర్తలపై లేనిపోని కేసులు బనాయిస్తున్నారనీ, వీటిపై త్వరలోనే పోరాటం చేస్తామని ఉత్తమ్ చెప్పారు.
తెరాసలో అసంతృప్తులు వ్యక్తమైనమాట నిజమే. ఉత్తమ్ చెప్పిన ఆ నలుగురు తెరాస నేతల్లో ఒకరైన షకీల్, భాజపా ఎంపీ అరవింద్ తో కలిసి మాట్లాడారు కూడా. అయితే, తెరాసలో అసంతృప్తులకు దాన్ని వెళ్లగక్కే నైతిక స్థైర్యాన్ని ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. భాజపా బలం పుంజుకుంటుందనే అభిప్రాయం మెల్లగా బలపడుతోంది కాబట్టి, ప్రత్యామ్యాయంగా కేంద్రంలో అధికార పార్టీ ఉందనే ఒకింత ధీమా కొంతమంది తెరాస నేతల్లో వ్యక్తమౌతున్న పరిస్థితి. అంటే, ఈ విషయంలో కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ మారాలనుకునే తెరాస నేతలకు ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ భాజపా. ఆ తరువాతి స్థానంలో కాంగ్రెస్ ఉందని చూస్తున్నారా అనేది అనుమానమే! ఇవన్నీ ఇంత స్పష్టగా అందరికీ కనిపిస్తుంటే.. మాతో టచ్ లో ఉన్నారు అనే వ్యాఖ్య ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ఉత్తమ్ ప్రయత్నిస్తుంటే అంతకంటే హాస్యాస్పదాంశం మరొకటి ఉండదు!