గోదావరిలో మునిగిపోయిన రెండు అంతస్తుల లాంచీ ప్రమాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికి ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయి. కనీసం 35 మంది గల్లంతయ్యారు. నిన్న రోజంతా వెదికినా.. ఆచుకీ కనిపెట్టలేకపోయారు. బోటు ఎక్కడో 375 అడుగుల లోతులో గుర్తించామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ బోటులోనే అందరూ ఇరుక్కుపోయి ఉంటారని కూడా… అంటున్నారు. కానీ.. ప్రమాదం నుంచి బయటపడిన వారు మాత్రం… నీళ్లలో కొట్టుకుపోయారని చెబుతున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ఓ మహిళ.. తన బిడ్డ తన చేతుల్లోనుంచి కొట్టుకుపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. కనీసం ఆ మృతదేహాన్ని కూడా గుర్తించలేకపోయారు.
ప్రమాదం జరిగిన తర్వాత తీరిగ్గా స్పందించిన అధికారులు… తర్వాత ప్రమాద తీవ్రతను అంచనా వేయడానికి ఒక రోజు తీసుకున్నారు. ఉత్తరాఖండ్ నుంచి నిపుణలొస్తారని చెప్పినటికీ.. స్థానికంగా ఉన్న వనరులతోనే… నిన్నంతా అన్వేషణ కొనసాగించారు. సాయంత్రానికి చత్తీస్ ఘడ్, గుజరాత్ నుంచి కూడా నిపుణులు వస్తారని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక రోజు తర్వాత ప్రభుత్వం ఇలా ప్రకటనలు చేయడమేమిటని బాధితుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. నిపుణులు అవసరం అయితే శరవేగంగా తెప్పించాలి కానీ… వాళ్లను పిలిపిస్తాం.. వీళ్లను పిలిస్తాం అని మాటలతోనే రాష్ట్ర ప్రభుత్వం సరిపెడుతోందనే విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి ప్రమాద ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసి.. బాధితుల్ని పరామర్శించారు. ఎక్కడా ప్రభుత్వ తప్పిదాన్ని అంగీకరించేందుకు ముఖ్యమంత్రి సిద్ధపడలేదు. కానీ.. అక్కడ రివ్యూ చేశారు కానీ… ప్రమాదం గురించి… సహాయ చర్యల గురించి.. పెద్దగా మాట్లాడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోట్లను తనిఖీ చేయడం గురించి.. వాటిని తక్షణం ఆపేయడం గురించి ఆదేశాలిచ్చారు. పనిలో పనిగా.. గత ప్రభుత్వం ప్రైవేటు బోట్ల మీద అజమాయిషీ లేకుండా జీవో ఇచ్చిందంటూ.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లితో చెప్పించి.. అవే మాటలను ప్రసారం చేసుకుని సంతృప్తి పడ్డారు. అలాంటి జీవో ఉంటే.. బయట పెట్టి విమర్శలు చేస్తే.. ప్రభుత్వానికి కాస్త గౌరవం అయినా ఉండేది.
బోటు మునుగుతున్న సమయంలోనే… శరవేగంగా స్పందించి ఉంటే.. ఇంత ఘోరంగా పరిస్థితులు ఉండేవి కాదన్న అభిప్రాయం.. అధికారవర్గాల్లోనూ ఉంది. అధికార వర్గాల్లో ఏర్పడిన జడత్వం… మనోళ్లోలే అనే భావనతో.. పెరిగిపోయిన నిర్లక్ష్యం కారణంగా… ఇప్పుడు… 50 మందిప్రాణాలు జలసమాధి అయ్యాయి. అందులో 40 మంది ఇక దొరుకుతారా.. లేదా.. అన్నంత విషాదం. ఆ కుటుంబాలకు ఏపీ సీఎం ఇచ్చే పది లక్షలు భరోసానిస్తాయా..?