పరిటాల రవి, కోడెల శివప్రసాదరావు.. తమ తమ ప్రాంతాల్లో టైగర్లుగా ప్రచారం పొందిన వారే. పీడత వర్గాల ప్రజలను కాపాడి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వారే. రాష్ట్ర స్థాయిలో వీరు… పార్టీ కోసం… శ్రమించారు. వీరి స్ఫూర్తితో ఎదిగిన యువనేతలు ఎంతో మంది ఉన్నారు. అయితే.. వీరు ఎంత ఎదిగారో.. అంతగా శత్రువులు కూడా తయారయ్యారు. రాజకీయ కక్షలు వ్యక్తిగతంగా మారడంతో.. అధికారం కోల్పోయిన తర్వాత ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో.. అనంతపురంలో… పల్నాడులో ఒకే లాంటి పరిస్థితులు ఉండేవి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలను ఎదుర్కోవడానికి డైనమిక్ యువత కావాలన్న ఉద్దేశంతో.. అప్పటికే ప్రజల్లో కొంత పలుకుబడి తెచ్చుకున్న పరిటాల రవి, కోడెల శివప్రసాదరావులను ఎన్టీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఎన్టీఆర్ నమ్మకాన్ని వారిద్దరూ వమ్ము చేయలేదు. అనంతపురంలో పరిటాల, పల్నాడులో కోడెల.. అప్పటి వరకూ ఉన్న పరిస్థితుల్ని మార్చేశారు. భయానక వాతావరణం నుంచి సాధారణ స్థితికి పరిస్థితుల్ని తీసుకు వచ్చారు. అందుకే వీరికి టీడీపీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అయితే… వీరు తమ ప్రాభవాన్ని తగ్గించడాన్ని ప్రత్యర్థి పార్టీల నేతలు సహించలేకపోయేవారు. వారి ప్రయత్నాలు పరిటాల రవి విషయంలో పదిహేనేళ్ల కిందటే నెరవేరగా.. కోడెల విషయంలో ఇప్పుడు … సక్సెస్ అయ్యాయి. పరిటాల రవి దారుణంగా.. కాల్చి చంపగా… కోడెల శివప్రసాద్ ను మానసికంగా హింసించి… చంపేశారని టీడీపీ నేతలు అంటున్నారు. పల్నాటి పులిగా ఎదిగిన కోడెల 72 ఏళ్ల వయసులో.. కేసుల పేరుతో…. ప్రజల్లో పరువు తీసేందుకు…ప్రభుత్వం చేసిన రాజకీయంతో మానసిక స్థైర్యం కోల్పోయారని టీడీపీ నేతలంటున్నారు..
2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత…. ఆరు నెలల స్వల్పకాలంలోనే… పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల రవీంద్రను కోల్పోయింది. అప్పట్లో ప్రభుత్వం మారినప్పటి నుండి పరిటాల రవికి ముప్పు ఉందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. తనను చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో వివరిస్తూ.. ఆయన ఓ టీవీ చానల్ కు ఇంటర్యూ ఇచ్చారు. అలా ఇచ్చిన కొద్ది రోజులకే… హత్యకు గురయ్యారు. అంతకు ముందు నుంచి ప్రభుత్వం వరుసగా ఆయనకు సెక్యూరిటీని తగ్గిస్తూ వచ్చింది. ఎక్కడకు చివరికి పరిటాల రవి ప్రచారం జరిగినట్లే హత్యకు గురయ్యారు. అప్పుడేం జరిగిందో పరిశీలిస్తే.. పరిటాలది ప్లాన్డ్ మర్డర్ అని అర్థమవుతుంది. ఇప్పుడు కోడెల విషయంలో విభిన్నంగా ప్రయత్నించారు… అంతే తేడా..!