కేసులతో వెంటాడి.. వేధించి.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి కారణమయ్యారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల మృతిపై… సీబీఐ విచారణ జరిపిచాలని డిమాండ్ చేశారు. కోడెలను కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకూ ప్రతి ఒక్కరూ వేధించారని.. చంద్రబాబు ఆరోపించారు. దేశ చరిత్రలో స్పీకర్ లాంటి ఉన్నత పదవిని అధిరోహించిన వ్యక్తి.. ఆత్మహత్య చేసుకోవడం ఇదే ప్రథమమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థాయిలో.. ప్రభుత్వం వేధింపులు కొనసాగాయని గుర్తు చేశారు. కోడెలపై గత మూడు నెలల కాలంలో కొత్తగా 19 కేసులు పెట్టారని… పాత కేసులు తిరగదోడారని గుర్తు చేశారు. కోడెలను శారీరకంగా.. మానసికంగా… ఆర్థికంగా వేధించారని… మండిపడ్డారు. చీటింగ్ కేసుల్లో ఉన్న వారిని పోలీసులు బెదిరించి… కోడెలపై అక్రమంగా ఫిర్యాదులు చేయించారని చంద్రబాబు మండిపడ్డారు. క్రికెటర్ పేరుతో చీటింగ్ కు పాల్పడే నాగరాజు అనే వ్యక్తి ఫిర్యాదును చంద్రబాబు ఉదహరించారు.
కోడెల చనిపోయిన తర్వాత ఆయన కుమారుడిపై జగన్ మీడియా చేసిన ఆరోపణలపైనా.. చంద్రబాబు ఘాటుగా స్పందించారు. కోడెల శివరాం.. విదేశాల్లో లేకుండా.. ఇండియాలోనే ఉండి ఉంటే.. ఆయనే చంపారని.. కేసులు పెట్టి ఉండేవారన్నారు. కోడెల తప్పు చేసి చనిపోలేదని… కేవలం వేధింపుల వల్లే చనిపోయారన్నారన్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో… కోడెల పరువు తీసే ప్రయత్నాలు ఎలా జరిగాయో చంద్రబాబు వివరించారు. జూన్‌లోనే ఫర్నీచర్ తీసుకెళ్లాలని కోడెల లేఖ రాసినా… పట్టించుకోలేదని.. బయటపెట్టారు. ఆ తర్వాత మరో నాలుగు సార్లు లేఖ రాసినా… స్పందించకుండా.. కేసులు పెట్టడానికి ఉత్సాహం చూపించిన వైనాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు, ఆలిండియా సర్వీసు అధికారులు సరెండర్ అయ్యారని.. మండిపడ్డారు. తక్షణం.. కోడెల మృతి విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని.. గత మూడు నెలలుగా ఏం జరిగిందో విచారణలో తేల్చాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
నిజానికి.. వైసీపీ సర్కారే.. కోడెల మృతి విషయంలో.. అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సాక్షాత్తూ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా.. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా.. చిలువలు పలువలుగా కథనాలు ప్రసారం చేసింది. ఇప్పుడు… కోడెల మృతిపై.. సీబీఐ విచారణకు… టీడీపీనే డిమాండ్ చేస్తోంది. వైసీపీకి కూడా అనుమానాలున్నాయి. ఈ విషయంలో… సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయకపోవడానికి…ప్రత్యేకంగా కారణాలేమీ ఉండకపోవచ్చు. మరి ఏపీ సర్కార్ చొరవ తీసుకుంటుందా..?