వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే… రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటిలో.. 25 శాతం కన్నా తక్కువ పూర్తయిన పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ఇప్పుడు… మూడున్నర నెలల తర్వాత ఆ పనులన్నీ…ప్రారంభించలేదన్న కారణంగా…రద్దు చేయడం ప్రారంభించారు. అంటే… పనులు ఆపేయమని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వమే. ఇప్పుడు.. పనులు చేయడం లేదని ఆ పనులను రద్దు చేస్తుంది కూడా ప్రభుత్వం. ప్రభుత్వం పనులు నిలిపి వేయాలనుంటే.. ఎంత ప్లాన్ ప్రకారం నిలిపివేస్తుందో.. పంచాయతీ రాజ్ శాఖలో మంజూరైన పనులన్నింటినీ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో క్లారిటీ వచ్చేసిందని.. అధికార వర్గాలంటున్నాయి.
గ్రామాల్లో.. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కోసం… గత ప్రభుత్వం పనులు మంజూరు చేసింది. అది నిరంతర ప్రక్రియ ఓ వైపు పనులు కొనసాగుతూంటే.. మరో వైపు కొత్త పనులు మంజూరు చేస్తూంటారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు ఎక్కువ మంజూరు అవుతుంటాయి. ఇలా ఏప్రిల్ కు ముందు 13 జిల్లాల్లో రూ.1031.17 కోట్ల విలువైన పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటన్నింటిని ఇప్పుడు, ఏప్రిల్ ఒకటికి ముందు అనుమతి పొందినా పనులు ప్రారంభం కాకపోవడంతో నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం నేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నుంచి పోలవరం వరకు ప్రతీ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోయింది.
చిన్న, మధ్య స్థాయి అభివృద్ధి పనులూ ఆగిపోయాయి. ఇప్పుడు గ్రామాల్లో.. చిన్న చిన్న రోడ్లు… ఇతర మౌలిక సదుపాయాల పనులనూ నిలిపివేశారు. సంక్షేమ పథకాలకు నిధులు సరిపోయే పరిస్థితి లేనందున.. ఇలా అభివృద్ధి పనుల నిధులన్నింటినీ… డబ్బు పంపిణీ పథకాలకు మళ్లించడానికే ఈ రద్దులు చేస్తున్నారన్న అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది.