టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. వైకాపా సర్కారు వేధింపులు భరించలేక, అవమానాలు తట్టుకోలే ఆయన చనిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎలాంటి సంక్షోభాలనైనా ధైర్యంగా ఎదుర్కొన్నారనీ, అవమానం జరిగేసరికి భరించలేకపోయారన్నది టీడీపీ అభిప్రాయం. అయితే, దీనికో రివర్స్ థియరీ చెప్పారు వైకాపా నేత, మంత్రి కొడాలి నాని
కోడెల ఆత్మహత్య మీద సమగ్ర దర్యాప్తు జరగాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారనీ, మేమూ అదే కోరుకుంటున్నామనీ, దర్యాప్తు జరిగితే ఆత్మహత్యకు అసలు కారకుడు చంద్రబాబు అని బయటపడుతుందని కొడాలి ఆరోపించారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలంటే తనకు తెలిసి ఒకటే కారణం ఉంటుందనీ, ప్రత్యర్థి పార్టీ నాయకుడైన జగన్మోహరెడ్డి, లేదా ఇతర నాయకులో కేసులు పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడితే పోరాటం చేస్తారుగానీ, ఆత్మహత్య చేసుకోరన్నారు. మనం నమ్ముకున్న కుటుంబ సభ్యులుగానీ, పార్టీగానీ, పార్టీ నాయకుడుగానీ పట్టించుకోకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందన్నారు. వైకాపా నుంచి 23 సభ్యులు టీడీపీలోకి వచ్చి చేరినా, చంద్రబాబు మాటలు నమ్మి వారిపై అనర్హత వేటు వేయకుండా కాపాడినా, ఇంత చేసిన తనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చేశారన్న బాధతో కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్నారు. గత పది రోజులుగా చంద్రబాబును కలిసేందుకు కోడెల ప్రయత్నిస్తున్నా, కావాలనే అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కోడెలని మొదట్నుంచీ చంద్రబాబు అవమానిస్తున్నారనీ, 1999లో మంత్రి పదవి ఇవ్వకుండా కోడెలని పక్కన పెట్టారనీ, 2014 ఎన్నికల్లో నర్సరావుపేట సీటు అడిగితే ఇవ్వకుండా బలవంతంగా సత్తెనపల్లి పంపించారనీ, సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రి పదవి అడిగినా ఇవ్వకుండా బలవంతంగా స్పీకర్ ని చేసింది చంద్రబాబు కాదా అని నాని నిలదీశారు. 9 రోజులపాటు వైకాపా బాధితుల కోసం అంటూ నిర్వహించిన క్యాంపునకి కోడెలను రాకుండా అడ్డుపడింది ఎవరన్నారు? పల్నాడులో జరుగుతున్న ఆందోళనకి పల్నాడు పులి ఎందుకు రాలేదన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోగానే తన పేరున ఏదైనా లెటర్ రాశాడేమో అని టెన్షన్ పడిపోయారనీ, అలాంటిదేదీ లేదని తెలియగానే వెంటనే చంద్రబాబు రాజకీయం మొదలుపెట్టేశారని నాని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం వేధిస్తే పోరాటం చేస్తారనీ, సొంత పక్షం వేధిస్తేనే ఇలా దిక్కుతోచక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఉంటాయనేది నాని థియరీ.