తెలంగాణకు కొత్త గవర్నర్ గా తమిళిసై నియామకం దగ్గర్నుంచే ఇది భాజపా వ్యూహాత్మక నిర్ణయంగానే అనిపించింది. తెలంగాణలో పట్టు పెంచుకునే పనిలో ఆ పార్టీ ఉంది. నాయకుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది. వచ్చే ఎన్నికల నాటికి తామే ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాలనీ, అధికారంలోకి వచ్చేది కూడా తామే అనే ధీమాతో నేతలు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా భాజపా యాక్టివిటీ ఇలా ఉంటే… రాష్ట్రానికి కొత్తగా వచ్చిన గవర్నర్ తమిళిసై ఇకపై రాజ్ భవన్ లోనే ప్రజాదర్బారు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ప్రగతి భవన్ లో సమస్యలు తీరడం లేదన్న ఉద్దేశంతో ప్రజల బాధలు వినేందుకు ప్రజాదర్బార్ నిర్వహించాలంటూ ట్విట్టర్లో అమానుల్లా ఖాన్ కోరగానే.. వెంటనే తమిళిసై స్పందించేశారు. తాము కూడా అదే అభిప్రాయంలో ఉన్నామనీ, తమ ఆలోచనను తెలిపినందుకు ధన్యవాదాలు అన్నారు.
ఇకపై ప్రజాదర్బారు అనేది రాజ్ భవన్ లో నిర్వహిస్తారన్నది స్పష్టం. నిజానికి, ప్రగతి భవన్ లో కూడా ఇదే తరహా ప్రజాదర్బారు నిర్వహిస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ, అక్కడ ప్రజలు కష్టాలు వినే పరిస్థితి లేదనే విమర్శలున్నాయి. రాజకీయంగా చూసుకుంటే… ఇది భాజపా వ్యూహాత్మక నిర్ణయంగానూ కనిపిస్తోంది. సమస్యలు ముఖ్యమంత్రి దగ్గరకి కాకుండా, నేరుగా గవర్నర్ దగ్గరకి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో, అంటే నర్సింహన్ గవర్నర్ గా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీ ఆయనకీ సత్సంబంధాలు ఉండేవి. భాజపాతో కూడా తెరాసకు దోస్తీ బాగానే ఉండేది. నర్సింహన్ హయాంలో ప్రజాదర్బారులు నిర్వహించినా, అవి పండగలకో పబ్బాలకో మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో భాజపా రాజకీయ లక్ష్యం మారిపోయింది. తెరాసను ప్రధాన ప్రత్యర్థి పక్షంగా చూస్తోంది. ఇప్పుడు గవర్నర్ ద్వారా అమలు చేస్తున్న కార్యాచరణ కూడా ఆ రాజకీయ లక్ష్యానికి ఊతమిచ్చేలానే కనిపిస్తోంది.
గవర్నర్ స్వయంగా ప్రజాదర్బారు నిర్వహించాలనే నిర్ణయం తెరాసలో కొంత కలకలం రేపుతుంది. ప్రజలతో గవర్నర్ నేరుగా ఇంటరాక్ట్ అవుతుంటే… అధికార పార్టీ ఏం చెయ్యాలి? ఇది ఓరకంగా ప్రతిపక్ష పార్టీలకు కూడా కొంత ఊతమిచ్చేదే అవుతుంది. కేసీఆర్ మీద నమ్మకం పోయింది కాబట్టే, ప్రజలు నేరుగా గవర్నర్ దగ్గరకి వెళ్లి సమస్యలు చెప్పుకుంటున్నారు అనే కోణాన్ని సమీప భవిష్యత్తులో తెరమీదికి తెస్తారు. గవర్నర్ తాజా నిర్ణయాన్ని తెరాస ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ప్రజల పాయింటాఫ్ వ్యూలో చూసుకుంటే… గవర్నర్ ఇలా చొరవ చూపించడం మంచి నిర్ణయమే.