సౌదీ ఆరేబియా ప్రభుత్వరంగ సంస్థ ఆరామ్‌కోపై డ్రోన్ దాడులు.. భారత్‌పై పెట్రో బాంబుగా మారుతోంది. డ్రోన్ దాడుల్లో.. ఆరామ్‌కోకి చెందిన రెండు రిఫైనరీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడున్న డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడమే కాదు.. దెబ్బతిన్న రిఫైనరీ మళ్లీ అందుబాటులోకి రావాలంటే చాలా రోజులు పడుతుంది. అమెరికా హెచ్చరికలతో.. చిరకాల మిత్రుడిగా ఉన్న ఇరాన్ నుంచి.. మోడీ సర్కార్ చమురు కొనుగోలు నిలిపివేసింది. సౌదీ నుంచి కొనుగోలు పెంచింది. ఇప్పుడు సౌదీ నుంచి భారత్ కు పెట్రోలియం దిగుమతి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.
సౌదీ దగ్గర ప్రస్తుతానికి అదనపు నిల్వలున్నాయి. కానీ అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో..స్థానికంగా రేట్లు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 5, 6 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు చమురు ధరలు పెరిగితే.. పెను ముప్పు తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దేశంలో ఆర్థిక పురోగతి నెమ్మదించింది. అమ్మకాలు పడిపోయాయి. నగదు సరఫరా స్లో అయింది. ఈ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయమని భావిస్తున్నారు.
ఇప్పటికే దేశంలో ఆర్థిక వృద్ధిరేటు పడిపోయింది. ఆటో మోబైల్ సెక్టార్ కూడా నెగిటివ్ ఫలితాలను చూస్తోంది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఇప్పటికే అమ్మకాలు లేకుండా ఉన్న ఆటో ఇండస్ట్రీపై ఇది అతిపెద్ద దెబ్బగా మారనుంది. ఇక నిత్యవసర వస్తువులు పెరిగితే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సౌదీ ఆరేబియాలో దాడుల్లో దెబ్బతిన్న రిఫైనరీల్లో ఉత్పత్తి మళ్లీ పాత స్థాయికి రావాలంటే దాదాపు 2 నుంచి 3 నెలలు పడుతుందని సౌదీ చెబుతోంది. అప్పటివరకు చమురు ధరలు ఇలాగే ఉంటే..దేశంలో ప్రజల పరిస్థితి పెట్రోల్ బాంబుకు బలైనట్లే మారుతుంది.