ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు చట్టాన్ని, రాజ్యాంగాన్ని పాటించకుండా ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారని వస్తున్న విమర్శల నేపధ్యంలో కేంద్రం.. అసాధారణ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా…తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు, పోలీసులను అడ్డం పెట్టుకుని… టీడీపీ నేతల్ని వేధిస్తున్న తీరుపై… ఆ పార్టీకి చెందిన నేతలు.. కిషన్ రెడ్డిని హైదాబాద్‌లో కలిసి వినతి పత్రం అందించారు. ఆ వినతి పత్రంతో పాటు.. మూడు నెలల కాలంలో జరిగిన వ్యవహారాలు… కోడెలపై పెట్టిన కేసులు.. వాటి విషయంలో… జగన్ మీడియా వ్యవహరించిన తీరు.. ఇలా ప్రతీ అంశాన్ని ఆధారాలతో సహా కిషన్ రెడ్డికి ఇచ్చారు.
టీడీపీ నేతల ఫిర్యాదులపై…తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఏపీ పోలీసుల తీరుపై.. తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అలాగే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా… ఫిర్యాదులు అందాయన్నారు. పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి… కేంద్రంతో పూర్తిగా దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. ఏ ప్రభుత్వం అయినా చట్టాలు చేతిలోకి తీసుకోకూడదని.. ఈ విషయంపై ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో సమగ్ర నివేదిక తెప్పిచుకుంటామని స్పష్టం చేశారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత అవసరమైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానన్నారు.
తెలుగు రాష్ట్రాల బాధ్యతలను.. తనకు అప్పగించాలని కిషన్ రెడ్డి పదవి చేపట్టిన మొదట్లోనే చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. కోడెల ఆత్మహత్యపై.. బీజేపీ నేతలందరూ… ప్రభుత్వ వేధింపుల వల్లే అనే స్టాండ్‌కు పరిమితమయ్యారు. మరో వాదన వినిపించడం లేదు. పైగా పోలీసుల పనితీరుపై.. బీజేపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పల్నాడులో బహిరంగసభ ఏర్పాటు చేసుకుంటే.,.. దాన్ని కూడా నిర్వహించకుండా… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను పోలీసులు అరెస్ట్ చేయడం … ఆ పార్టీ హైకమాండ్‌కు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. అందుకే పోలీసుల పనితీరుపై.. విచారణ జరిపించడం లాంటి కీలక నిర్ణయాల గురించి కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు.