ముకుంద నుంచి వాల్మీకి వరకూ
ఏ సినిమా తీసుకున్నా,
ఏ పాత్ర ఎంచుకున్నా,
ఒకదానికీ మరోదానికీ ఎలాంటి సంబంధం లేకుండా సాగుతుంది వరుణ్‌తేజ్ కెరీర్.
అందరు మెగా హీరోల్లా ఓ ఇమేజ్‌లో కూరుకుపోకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు వరుణ్‌తేజ్. ఆ ప్రయాణంలో హిట్లొచ్చాయి, ఫ్లాపులూ వచ్చాయి. కానీ నటుడిగా మాత్రం సినిమా సినిమాకీ తనలో మార్పు చూపిస్తున్నాడు. ఇప్పుడు `వాల్మీకి`లోనూ గద్దలకొండ గణేష్‌గా విజృంభించినట్టే కనిపిస్తున్నాడు. శుక్రవారం ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌తో చేసిన చిట్ చాట్ ఇది.
కెరీర్లో ఈ సమయంలో జిడత్తాండ లాంటి రీమేక్ ఎంచుకోవడానికి కారణమేంటి?
– ఫిదా, తొలి ప్రేమ తరవాత నా దగ్గరకు వచ్చిన ఏ దర్శకుడైనా లవ్ స్టోరీనే చెబుతున్నాడు. నాకైతే లవ్ స్టోరీలకు కాస్త బ్రేక్ ఇద్దామనిపించింది. అందుకే మళ్లీ వాటి జోలికి వెళ్లలేదు. హరీష్ శంకర్ నా దగ్గరకు `దాగుడు మూతలు` కథతో వచ్చారు. నిజానికి ఆ కథ నాకు బాగా నచ్చింది. `ఈ సినిమా నాతోనే ఎందుకు చేద్దామనుకుంటున్నారు?` అని అడిగాను. `నువ్వు లవ్ స్టోరీల్ని ఎంచుకుంటున్నావ్ కదా. అందుకే ఈ కథ చెప్పాను` అన్నారు. `నేను మీ స్టైల్ లో సినిమా చేయాలనుకుంటున్నా` అన్నాను. ఆ సందర్భంలోనే జిగడ్తాండ రీమేక్ ఆలోచన చెప్పారు. ఆ సినిమా మరోసారి చూడు.. తరవాత మాట్లాడుకుందాం అన్నారు. జిగడ్తాండ చూశాక మేం ఇద్దరం కలిసి కూర్చున్నాం. కొన్ని మార్పులు చేర్పులూ చేసుకుంటే బాగుంటుందనిపించింది.
జిగర్తాండ తో పోలిస్తే ఎంత వరకూ మార్చారు?
– 50 శాతం మార్చాం. తమిళంలో బాబీ సింహా విలన్‌గా నటించారు. ఆ పాత్ర అలా ఎందుకు మారింది అనేదానికి పెద్దగా రీజనింగ్ ఉండదు. తెలుగులో కాస్త ఫ్లాష్ బ్యాక్ పెట్టాం. ఆక్కడే పూజా హెగ్డే కూడా కనిపిస్తుంది. `బాబీ సింహాకు తమిళంలో ఎలాంటి ఇమేజ్ లేనప్పుడు చేసిన పాత్ర అది. అందుకే ఆయన విలన్ అంటే అందరూ నమ్మారు. నీకు అలా కాదు. అందుకే ప్రేక్షకుల్ని ఒప్పించాలి` అన్నారు హరీష్. ఆయన చెప్పింది నిజమే అనిపించింది. అందుకే కొన్ని చోట్ల మార్పులు అవసరమయ్యాయి. కాకపోతే.. జిగడ్తాండ ఓ క్లాసిక్. అలాంటి సినిమాల్ని కెలక్కూడదు. కానీ ఆ సినిమా చూసినవాళ్లకు కూడా వాల్మీకి నచ్చాలి అనే ఉద్దేశంతో మార్పులు చేయాల్సివచ్చింది.
వెల్లువొచ్చె గోదారమ్మ.. రీమేక్స్ చేసినప్పుడూ టెన్షన్‌పడ్డారా?
– ఏమాత్రం టెన్షన్ పడలేదు. ఎందుకంటే అది డాన్స్‌పై ఆధారపడిన పాట కాదు. లొకేషన్లు, తీసిన పద్ధతి బాగుంటే చాలు. అవి పక్కాగా కుదిరాయి. `ఈ పాట తప్పకుండా బాగుంటుంది చూడు` అని హరీష్ నాతో పదే పదే చెబుతుండేవాడు. అంత నమ్మకంగా ఎందుకు చెప్పాడో నాకు ఈ పాట చూస్తున్నప్పుడు అర్థమైంది.
ఫ్లాష్ బ్యాక్ గెటప్‌లో మీ లుక్ చూస్తుంటే… చిరంజీవిగారిని ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తోంది..?
– అవునండీ.. చిరంజీవిగారి లుక్‌ని చూసే కాపీ కొట్టాను. నిజానికి డాడీనే ఈ లుక్ నాకు పంపారు. పునాదిరాళ్లు సమయంలో ఆయన అలానే ఉండేవారు. అదే హెయిర్ స్టైల్‌ని నేను ఇందులో ట్రై చేశా.
ఈ కథ చిరంజీవిగారికి వినిపించారా?
– అసలు ఈ సినిమా ఒప్పుకున్న వెంటనే చిరంజీవిగారికే చెప్పాను. హరీష్, నేనూ కలిసి ఆయన దగ్గరకు వెళ్లాం. హరీష్ కథ కథ వినిపించాడు. ఆయన హీరోనా, విలనా? అని అడగలేదు. ఈ పాత్ర చాలా బాగుంది అన్నారు. కొన్ని మార్పులు కూడా చెప్పారు.
మరోసారి పూర్తి స్థాయి తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడారు కదా? అందుకోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
– ప్రత్యేకంగా కసరత్తులేం చేయలేదు. ఎఫ్ 2లోనూ తెలంగాణలోనే మాట్లాడాను కదా? కాకపోతే ఆ భాష కాస్త క్లాస్‌గా ఉంటుంది. ఈసారైతే ఫుల్ మాస్. ప్రతీరోజూ హరీష్ తో కూర్చుని డైలాగుల్ని ప్రాక్టీసు చేసేవాడ్ని. అంతకు మించి కష్టపడిందేం లేదు. డబ్బింగ్ సమయంలో మాత్రం చాలా టైమ్ తీసుకున్నా.
మరీ ముఖ్యంగా ఇంట్రవెల్ బ్యాంగ్ ముందొచ్చే సీన్ కోసం కష్టపడ్డాను.
తొలి సినిమా నుంచి ఇప్పటి వరకూ మీ కెరీర్‌ని విశ్లేషించుకుంటే.. ?
– ప్రయాణం సాఫీగా సాగుతోంది. వరుణ్ అంటే ఇలాంటి పాత్రలే చేయగలడు అని కాదు. వరుణ్ అంటే ఏమైనా చేయగలడు అనుకునేలా ఉండాలి. అలాంటప్పుడు ఎక్కువ ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.
అంతరిక్షం ఫలితం నిరాశ పరిచిందా?
– ఆ సినిమా కాస్త అటూ ఇటుగా వస్తోందని చిత్రీకరణ సమయంలోనే తెలిసిపోయింది. బడ్జెట్ పరిమితుల వల్ల మేం చాలా సందర్భాల్లో రాజీ పడిపోయాం. అది తెరపై కనిపించింది. కొన్ని సన్నివేశాల్ని సీజీలో తీయడం కష్టమైంది. అందుకే వాటిని తెరకెక్కిస్తున్నప్పుడే ఎడిట్ చేయాల్సివచ్చింది. దాంతో సినిమా చూస్తున్నప్పుడు జంపింగ్‌లు ఎక్కువగా కనిపిస్తాయి.
మళ్లీ అలాంటి కథ మీ దగ్గరకు వస్తే..?
– తప్పకుండా చేస్తాను. ఎందుకంటే… అంతరిక్షంలో నేను చేసిన తప్పులేంటో నాకు తెలిసొచ్చింది. అలాంటి తప్పులు ఈసారి పునరావృతం కానివ్వను.
ఎఫ్2 తరవాత మళ్లీ మల్టీస్టారర్ కథలొచ్చాయా?
– రాలేదు. కానీ వెంకటేష్‌గారు, నేను ఎప్పుడు కలిసినా మరో సినిమా చేద్దాం అన్నట్టే మాట్లాడుకుంటాం. ఎఫ్ 3 చేయాలని వుంది. ఏం జరుగుతుందో చూడాలి.