వరల్డ్ ఫేమస్ లవర్
– ఈ టైటిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
టైటిల్ బాగుందా, బాగోలేదా? అనేది జనాలకూ అర్థం కాని పరిస్థితి. కాకపోతే… `ఇదేం టైటిల్` అని ఆశ్చర్యపోయినవాళ్లే ఎక్కువ. వరల్డ్ ఫేమస్ బిర్యానీ, వరల్డ్ ఫేమస్ హలీమ్లా.. ఈ వరల్డ్ ఫేమస్ లవరేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఈ టైటిల్‌పై అప్పుడే ట్రోల్స్కూడా మొదలైపోయాయి. విజయ్‌కున్న ఇమేజ్‌కీ, ఈ టైటిల్‌కీ అస్సలు పొంతన కుదరడం లేదు. డియర్ కామ్రేడ్ లా దూసుకుపోయే తత్వం ఈ టైటిల్‌కి లేదు. కథతోనే దానికి ఓ జస్టిఫికేషన్ తీసుకురావాలి. అంటే.. సినిమా బయటకు వచ్చేంత వరకూ ఈ టైటిల్ ఎక్కే ఛాన్సే లేదు.
నిజానికి ఓ టైటిల్ బయటకు వస్తుంటే, అది జనాలకు నచ్చుతుందా, లేదా? అని తెలుసుకోవడానికి కొన్ని ఫీలర్లు వదలడానికి ప్రయత్నిస్తుంటుంది చిత్రబృందం. విజయ్ సినిమాకి ఈ టైటిల్ అనుకుంటున్నార్ట.. అని బయట ఓ ప్రచారం మొదలవుతుంది. దానికొచ్చే స్పందన చూసి – టైటిల్ విషయంలో నిర్ణయం తీసుకుంటుంటుంది చిత్రబృందం. అయితే విజయ్ సినిమాకి అలాంటి ప్రయత్నాలూ చేయలేదు. సడన్‌గా ఈ టైటిల్ ప్రకటించేశారు. దాంతో.. పల్స్ తెలుసుకునే వీలు లేకుండా పోయింది. తొందరపడి టైటిల్ రివీల్ చేశామేమో అని దర్శక నిర్మాతలు ఇప్పుడు ఫీల్ అవుతున్నార్ట. టైటిల్ వదిలేశాక ఇప్పుడు ఆలోచిస్తే ఏం లాభం..? సినిమా కథతో, హీరో క్యారెక్టరైజేషన్‌తో ఈ టైటిల్ కి న్యాయం జరగాలి. అంతకు మించిన మార్గం లేదు.