చనిపోయిన తర్వాతా వదిలి పెట్టని వారిని రాబందులంటారు. ఇలాంటి రాబందులు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నాయి. ఓ సుష్మాస్వరాజ్, మరో అరుణ్ జైట్లీ.. ఇంకో కోడెల ఇలా ఎవరు.. చనిపోయినా… వారి చావుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి.. మానసిక రోగ లక్షణాలను బయట పెట్టుకుంటున్నారు. చనిపోయిన వారిని దేవుళ్లలో కలిసిన వ్యక్తిగా భావించిన గౌరవించడం మన సంప్రదాయం. కానీ ఇప్పుడు అది రాను రాను మారిపోతోంది. చనిపోయినవాళ్లందర్నీ మంచోళ్లుగా గుర్తించలేనంత మానసిక కాలుష్యానికి సోషల్ మీడియా కారణం అవుతోంది.
చావుల్నీ గౌరవించని ఘోరమైన ప్రపంచం..!
సోషల్ మీడియాలో చనిపోయిన వారి మీద కూడా.. చేస్తున్న ప్రచారం… వారు చెడ్డ వాళ్లని.. అందుకే వారిని మృత్యువు పలకరిచిందని.. పెట్టే పోస్టులు… మనో వికారాన్ని బయట పెడుతున్నాయి. చనిపోయిన వారిని కూడా గౌరవించలేనంత దుస్థితి రాజకీయం వల్లే వచ్చింది. ప్రత్యర్థి పార్టీని ఆ పార్టీ నేతల్ని తిట్టడమే అనుకోవడం దగ్గరే అసలు సమస్య వస్తోంది. ఒక పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మరో పార్టీ ని తిడతారు. మరి తిట్లు తిన్న పార్టీ నేతలు ఎందుకు ఊరుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే జరుగుతోంది. కోడెల మరణాన్ని వైసీపీ కార్యకర్తలు కించ పరిస్తే.. వైఎస్ మరణాన్ని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.
ఒక్క సారీ కలవని వాళ్లు చేసే వికృత చేష్టలు..!
ఓ వ్యక్తిని మంచివాడా..చెడ్డవాడా అని ఎవరూ నిర్ధారించలేరు. ఆయన చేసే మంచి కొంత మందికి మేలు చేయవచ్చు… మరికొంత మందికి కీడు చేయవచ్చు. మంచి చేసిన వాళ్లకు మంచోడవుతాడు. కీడు చేసిన వాళ్లకి చెడ్డవాడవుతాడు. అందరూ…ఈ రెండింటిలో ఉండాల్సిందే. ఎవరూ అందరికీ మంచి చేయలేరు. అలాగే అందరికీ కీడు చేయలేరు. రాజకీయ పార్టీల భావజాలంలోనూ అలాంటి పరిస్థితే బీజేపీ భావజాలం నచ్చితే… ఆ పార్టీకి అభిమాని అవుతాడు. కాంగ్రెస్ భావజాలం నచ్చితే.. ఆ పార్టీకి అభిమాని అవుతాడు. అంత మాత్రాన శత్రువులుగా పరిగణించి… మరణించిన తర్వాతా ప్రతీకారం తీర్చుకోవాల్సిన పని లేదు. అలా చేస్తే… కచ్చితంగా అసహనమే అవుతుంది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
అంతకంతకూ పెరిగిపోతున్న సోషల్ మీడియా సైకోయిజం..!
అటు సుష్మాస్వరాజ్ విషయంలో అయినా… అరుణ్ జైట్లీ విషయంలో అయినా.. చివరికి కోడెల శివప్రసాదరావు విషయంలో అయినా… మరణంపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న వారెవరూ… వారిని ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా చూసి ఉండరు. మాట్లాడి ఉండరు. అలా చేసి ఉంటే.. వారి గురించి సోషల్ మీడియాలో అలాంటి వ్యాఖ్యలు చేయరు. కేవలం… ప్రస్తుత రాజకీయాల్ని శాసిస్తున్న కులం, మతం , ప్రాంతం, పార్టీ బేధాల కారణంగానే… చనిపోయిన వారినీ సోషల్ మీడియా సైనికులు వదిలి పెట్టడం లేదు. ఇలాంటి వారిని రాజకీయ పార్టీలు ప్రొత్సహిస్తున్నాయి. ఇది రాను రాను ప్రమాదకరంగా మారుతోంది. సైకోల్ని తయారు చేస్తోంది.