దేశంలో ఉండాలంటే.. హిందీ నేర్చుకోవాల్సిందేనన్నట్లుగా మాట్లాడి కలకలం రేపిన కేంద్రహోంమంత్రి అమిత్ షా… దక్షిణాదిలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో కాస్త వెనక్కి తగ్గారు. మాతృభాష తర్వాతే హిందీ అన్నారు. అయితే.. ఇప్పుడు కొత్తగా… దేశం మొత్తం ఎన్నార్సీ రూపొందిస్తామని చెబుతున్నారు. అంటే.. దేశంలో ఉంటున్న వాళ్లు భారతీయులే అని నిరూపించుకోవాలంటే.. ఆ జాబితాలో పేరుండాలి. ఆ జాబితాను బీజేపీ సర్కార్ రూపొందిస్తుంది. నేషనల్ రిజిస్ట్రి ఆఫ్ సిటిజన్ షిప్ ని ఇప్పటికే అసోంలో అమలు చేశారు. ఓ ఇరవై లక్షల మందిని భారతీయులు కాదని… ప్రత్యేకంగా రెప్యూజీ క్యాంపుల్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మోదీ, షా సర్కార్లు దేశం మొత్తం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో పొరుగు దేశాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారని.. వారి కోసం.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ షిప్ అనే… పద్దతిని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఈ రిజిస్టర్లో ఉన్న వారు మత్రమే భారతీయులు. ఈశాన్య రాష్ట్రాల్లో అసలు వారి కన్నా… బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారన్న భావనతో దీన్ని తీసుకు వచ్చారు. అక్కడి ప్రజల్లోనూ.. తాము మైనార్టీలం అయిపోతున్నామన్న భావన ఉండటంతో.. ఓ రకంగా అంగీకారం లభించింది. అయితే… బీజేపీ.. తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడింది. హిందువులు ఇతర దేశాల నుంచి దేశంలోకి వచ్చి ఉంటే.. వారికి పౌరసత్వం ఇచ్చారు. ముస్లింలు చాలా మంది ఇండియన్స్ అయినప్పటికీ వారు శరణార్థుల జాబితాలో ఉండిపోయారు.
ఈ ఎన్నార్సీని ఇప్పుడు దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తామని.. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎన్నార్సీ రిజిస్టర్ లో చేరుస్తామని… దేశం కాని వాళ్లను బయటకు పంపుతామని చెబుతున్నారు. హిందువులు తమకు ఓట్లు వేస్తారు కాబట్టి.. పక్క దేశాల నుంచి వచ్చి తిష్టవేసినా.. వారికి పౌరసత్వం ఇస్తారు. అదే.. దేశంలో నిఖార్సైన భారతీయులు మాత్రం… అమిత్ షా నుంచి తాము భారతీయులమనే సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వెనక్కి తగ్గే అవకాశం లేదు.