రాయలసీమ విషయంలో బీజేపీ మెల్లగా తన కార్యాచరణను అమల్లోకి పెడుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలతో త్వరలో.. రాయలసీమలో పాదయాత్ర నిర్వహించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయంలో అనంతపురం పర్యటనలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం.. కడపలో సమావేశమైన బీజేపీ సీనియర్ నేతలు.. ఓ డిక్లరేషన్ ను ప్రకటించారు. దాని ప్రకారం.. జీవీఎల్ తన డిమాండ్లను వినిపించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. 3నెలల్లో అనంతపురం జిల్లాలో 50 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… అది బాధాకరమన్నారు. రాయలసీమవాళ్లు సీఎం అయినా అభివృద్ధి జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో నిర్ణయం రాష్ట్రానిదే, కేంద్రం జోక్యం ఉండదన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడ్డారు.
పాదయాత్ర ఆలోచన బాగానే ఉన్నప్పటికి… ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు బీజేపీకి ఎంపీలు లేరు. జీవీఎల్ కూడా ఉత్తరప్రదేశ్ కోటా కింద.. ఎంపీ అయ్యారు. అయన నర్సరావుపేటలో పుట్టానని చెబుతూంటారు కాబట్టి… ఆయనను ఏపీ ఖాతాలో వేసుకున్నా.. ఆయనొక్కరే ఎంపీ అవుతారు. మరో బీజేపీ ఎంపీ ఏపీ కోటాలో లేరు. గతంలో.. తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉన్న సమయంలో… సురేష్ ప్రభును.. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభకు పంపింది. బహుశా.. ఆయనను కూడా… ఏపీ కోటా కింద వేసుకుని ఎంపీల లెక్క పేరుతో… పాదయాత్ర చేయాలని జీవీఎల్ భావిస్తున్నారు. లేకపోతే.. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలను కూడా తీసుకొచ్చి.. పాదయాత్ర చేయిస్తారమో చూడాలి.
మరో వైపు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేయడం.. కాస్త ఎబ్బెట్టుగా ఉంది. హైకోర్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే. కేంద్రం సూచనల మేరకే… సుప్రీంకోర్టు హైకోర్టు ఏర్పాటు ఆదేశాలు జారీ చేస్తుంది. అలాగే.. కేంద్రానికి సంబంధించిన అనేక అంశాలు… రాయలసీమ ప్రయోజనాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నింటినీ కేంద్రం నెరవేర్చి.. పాదయాత్రలు చేస్తే ప్రజలు నమ్ముతారు కానీ… తమకేమీ సంబంధం లేదని.. అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసి రాజకీయ లాభం కోసం… యాత్రలు చేస్తే… ప్రజలు నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు.