తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. హుజూర్ నగర్ అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పేరును ప్రకటించేశారు. దాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూ మరో అభ్యర్థి పేరును ప్రతిపాదించిన సంగతి కూడా తెలిసిందే. అయితే, పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడుతూ… హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎవర్ని నిలబెట్టాలో తమకు బాగా తెలుసనీ, ఎవ్వరూ సలహాలు ఇవ్వక్కర్లేదన్నారు. ఈ మధ్యనే పార్టీలోకి వచ్చి చేరినవారు ఇచ్చే సలహాలూ సూచనలూ తమకు అవసరం లేదంటూ… పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కోమటిరెడ్డి మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఆ అభ్యర్థి ఎవరో తనకు తెలీదనీ, ఆయన పేరును కూడా వినలేదన్నారు! హుజూర్ నగర్లో పద్మావతి సరైన అభ్యర్థనీ, పార్టీలో నాయకులూ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునే నిర్ణయించామన్నారు. తమ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి సీనియర్ నేతలున్నారనీ, పొరుగు జిల్లాలకు చెందిన నాయకులు చేసిన వ్యాఖ్యాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇదే సమయంలో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు! ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చితే… తనకే ఎక్కువగా అవకాశాలున్నాయనీ, పార్టీలో సీనియర్ల సపోర్ట్ తనకు ఉందన్నారు.
కోమటిరెడ్డి మనోగతం అదన్నమాట! పీసీసీ పీఠంపై ఆయన ఎప్పట్నుంచో కన్నేశారు. విచిత్రం ఏంటంటే… ఉత్తమ్ కుమార్ నాయకత్వం బాగోలేదని గతంలో విమర్శించిన కోమటిరెడ్డి… ఇప్పుడు రేవంత్ దగ్గరకి వచ్చేసరికి ఉత్తమ్ తో ఎలాంటి విభేదాలు లేవన్నట్టు మాట్లాడుతున్నారు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఉత్తమ్, జానా, కోమటిరెడ్డిలు ఎవరిదారి వారిది అన్నట్టుగా ఉంటారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక దగ్గరకి వచ్చేసరి… ఇంకా చెప్పాలంటే ఈ అంశంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునేసరికి.. ఈ ముగ్గురూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. పీసీసీ పగ్గాలు రేవంత్ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ కొన్నాళ్లుగా జరుగుతున్నదే. ఈ మధ్యనే పార్టీలోకి వచ్చిన ఆయనకి ఇవ్వడమేంటనే అసంతృప్తితో హైకమాండ్ వరకూ కొంతమంది నేతలు వెళ్లి ఫిర్యాదులు చేసిన సంగతీ తెలిసిందే. ఆ పీసీసీ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో రేవంత్ మీద అసంతృప్తిని వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు కోమటిరెడ్డి. పార్టీలో ఈ మధ్యనే చేరారు అనే పాయింట్ ని మాత్రమే హైలైట్ చేస్తూ వస్తున్నారు.