మరి కొద్ది గంటల్లో వాల్మీకి బొమ్మ పడబోతోంది. అయితే… ఇప్పటికీ ఈ సినిమా వివాదాల కోరల్లోనే ఉంది. టైటిల్ విషయంలో వాల్మీకి వారసులు అని చెప్పుకుంటున్న ఓ వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సినిమా టైటిల్ మార్చాల్సిందేనని కోర్టు కెక్కింది. వాల్మీకి టైటిల్ లోగోలో కనిపిస్తున్న పిస్తోల్పై కూడా అభ్యంరాలు ఉన్నాయి. అయితే ఆ లోగోని మార్చడానికి ఒప్పుకున్న చిత్రబృందం టైటిల్ విషయంలో మాత్రం రాజీ పడలేదు. దాంతో వాల్మీకి సినిమా విడుదల ఆపేయాలని కోరుతూ అనంతపురం జిల్లా కలెక్టరు ని సంప్రదించారు ఆందోళనకారులు. అనంతపురంలో ఈ సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ జిల్లా కలెక్టరు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలులోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. ఈ రెండు జిల్లాలలో సినిమా విడుదల కాకపోతే… బయ్యర్లు తీవ్రంగా నష్టపోతారు. దాంతో 14 రీల్స్‌ప్లస్ సంస్థ తల పట్టుకుంటోంది. నిర్మాతలు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మార్నింగ్ షో నాటికి వ్యవహారం చక్కబడుతుందని, ఒకవేళ కాస్త ఆలస్యమైనా మ్యాట్నీ నుంచి షోలు పడడం ఖాయమని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అయితే కొన్ని నిర్ణయాలు మరీ హాస్యాస్పందంగా తయారవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోయే సినిమాని ఒకట్రెండు జిల్లాలలో ఆపేస్తే.. ఫలితం ఉంటుందా? అప్పుడు మనోభావాలు దెబ్బతినకుండా ఆగిపోతాయా? అసలు వాల్మీకి అనే టైటిల్‌పై హక్కు ఎవరికి ఉంది? అలాగైతే అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, భగత్‌సింగ్, సర్దార్, గబ్బర్ సింగ్…. ఇలాంటి పేర్లూ వాడుకోకూడదు కదా? ఓ సినిమాని చూసి సెన్సార్ చేసిన తరవాత… ఇలాంటి అవరోధాలు అడ్డుగోడలూ ఎందుకు? సెన్సార్ అనుమతి ఇచ్చిన సినిమాని అడ్డుకుంటే.. ఇక సెన్సార్ బోర్డే ఎందుకు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఇదంతా డబ్బుల కోసం ఆడే నాటకాలు అన్నది చిత్రసీమ ఉద్దేశం. ఎవరో ఒకరు.. ఏదో ఓ రూపంలో అడ్డు తగిలితే.. విడుదలకు ముందు కాస్త హంగామా సృష్టిస్తే ఎంతో కొంత ముడుతుంది కదా? అనే పన్నాగం. విడుదలకు ముందు ఇలాంటి స్పీడ్ బ్రేకర్లని ఏ నిర్మాతా తట్టుకోలేడు. సినిమా ఒక్క షో ఆగినా, లక్షల్లో నష్టాలొస్తాయి. ఎందుకొచ్చిన గొడవ అనుకుని నిర్మాతలు రాజీకొచ్చి, అడిగినంత ఇస్తే గండం నుంచి గట్టెక్కొచ్చు. ఇలా ఇచ్చుకుంటూ పోతే, రేపు మరొకరు తయారవుతాడు. అందుకే నిర్మాతలు కూడా ఇలాంటి విషయాల్ని న్యాయస్థానాల్లోనే తేల్చుకోవాలని చూస్తున్నారు. మన చట్టాలు, తీర్పులూ ఎప్పుడూ ఆలస్యమే కదా? సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ఇలాంటి తీర్పులు ఇస్తే, నిర్మాతల గుండెలు పగలడం ఖాయం. మరి వాల్మీకి బృందం ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. ఈ సినిమా సంగతి అటుంచితే, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా.. చిత్రసీమ అంతా ఓ ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి. పైరసీ విషయంలో సంఘటితమైనట్టే, ఇలాంటి బ్లాక్మెయిలింగులనూ తిప్పి కొట్టాలి.