జనసేన పార్టీ, ఆ పార్టీ సానుభూతి పరుల ఖాతాలను… ట్విట్టర్ అనూహ్యంగా బ్లాక్ చేయడంతో.. ఏర్పడిన అలజడి సద్దుమణిగింది. అదిరేది.. బెదిరేది లేదన్న జనసేనాధినేత పోరాటానికి ట్విట్టర్ ఇండియా దిగి వచ్చింది. అకౌంట్లన్నింటినీ రీ స్టోర్ చేసింది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక హక్కును కాలరాయకుండా.. పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే.. అసలు ఖాతాలను ఎందుకు నిలిపివేశారు..? ఎవరి కుట్ర అయినా ఉందా..? అనే విషయాలపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. దేశంలో భావ ప్రకటనా స్వేచ్చ ఉంది. అయితే.. ఇప్పుడు అది ప్రమాదంలో పడిందని.. జనసేన ట్విట్టర్ అకౌంట్ల బ్లాక్ చేయడం ద్వారా.. తేలిందని జనసేన వర్గాలు చెబుతున్నారు. ఆ కోణంలోనే పోరాటం చేశారు. అనుకున్న ఫలితం సాధించారు.
ఇటీవలి కాలంలో.. అధికారంలో ఉన్న వారు.. సోషల్ మీడియాను సైతం నియంత్రించడం.. తాము ఎంత దుష్ప్రచారం అయినా చేయవచ్చు కానీ.. తమ గురించి నిజాలు కూడా చెప్పకూడదన్నట్లుగా పాలకుల వ్యవహారశైలి ఉంది. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు పెడుతున్నారు. వారి కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసే పోస్టులపై ఫిర్యాదులు చేస్తే మాత్రం కనీసం స్పందించడం లేదు. ఇక్కడే అసలు కుట్ర బయటపడుతోంది. దీనికి తోడు… ప్రభుత్వాల స్థాయిలో ఒత్తిడి తెచ్చి… ప్రత్యర్థి పార్టీల ఖాతాలను బ్లాక్ చేయించే సంస్కృతికి కూడా.. ప్రాణం పోస్తున్నారు. జనసేన వ్యవహారంతో అది తేలిపోయింది.
ట్విట్టర్ ఖాతాలను నిలిపి వేయడంపై.. నేరుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిపోరాడారు. దీని కోసం ఆయన రోడ్డెక్కలేదు. ఆన్ లైన్ లోనే పోరాడారు. గడ్డిపరకతో విప్లవం ఎలా ఉంటుందో… చూపిస్తామన్నట్లుగా ఆయన చేసిన పోస్టు వైరల్ గా మారింది. ట్విట్టర్ ఇండియా విశ్వసనీయతపైనే సందేహాలు వెల్లువెత్తడం… యురేనియం ఉద్యమానికి వ్యతిరేకంగా ట్విట్టర్ కూడా వ్యవహరిస్తోందన్న భావన ప్రజల్లో ఏర్పడటంతో… ముందు జాగ్రత్తగా ట్విట్టర్ ఖాతాలను రీస్టోర్ చేసినట్లుగా తెలుస్తోంది. జనసేన ఖాతాల బ్లాక్ వెనుక అసలు కారణం ట్విట్టర్ ఇండియా బయట పెడితేనే.. తెర వెనుక ఏం జరిగిందో తెలుస్తుంది.