మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అవమానాల్ని భరించలేకే ఆయన అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఫర్నిచర్ తీసుకెళ్లిపోయారంటూ రాద్ధాంతం చేసి కేసులు పెట్టిందనీ ఆ పార్టీ అంటోంది. ఇదే అంశంపై వైకాపా నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో ఫర్నిచర్ తీసుకెళ్లిపోయారని కేసు పెట్టారనీ, లక్ష రూపాయల విలువున్న ఫర్నిచర్ కి ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారని అంబటి అన్నారు. అది లక్ష రూపాయల ఫర్నిచర్ కాదని, దానికి సంబంధించి అధ్యయనం చేసి అసలు విషయం తెలుసుకున్నానని చెప్పారు.
స్పీకర్ గా ఎన్నికయ్యాక ప్రభుత్వం ఆయనకి ఫర్నిచర్ ఇస్తుందనీ, పదవీ కాలం ముగిసిన తరువాత తిగిరి ఆ ఫర్నిచర్ తీసుకుంటుందని చంద్రబాబుతో సహా చాలామంది అనుకుంటున్నారనీ, అది కానే కాదని అంబటి చెప్పారు. స్పీకర్ కి ఫర్నిచర్ ఇవ్వాల్సిన అవసరం ఎవ్వరికీ లేదన్నారు! అయితే, ఇప్పుడున్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే… హైదరాబాద్ లో పాత అసెంబ్లీలో మనకు సంబంధించిన పూర్తి ఫర్నిచర్ ఇదన్నారు. హైదరాబాద్ లో రెండు అసెంబ్లీలున్నాయనీ, ఎన్టీఆర్ టైంలో కట్టింది ఒకటనీ, అంతకుముందున్న పాత అసెంబ్లీ మరొకటన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత కొత్త అసెంబ్లీ తెలంగాణకి ఇచ్చారనీ, పాతది మనకిచ్చారనీ, ఏపీకి మనం వచ్చాక ఆ ఫర్నిచర్ మొత్తం ఇక్కడికి తీసుకొచ్చి భద్రపరచారన్నారు. దీన్నే కోడెల శివప్రసాదరావు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా లారీల్లో ఎక్కించుకుని తరలించుకుపోయారన్నారు. హైదరాబాద్ లోని క్యాంపు ఆఫీసుకి కూడా కొంత ఫర్నిచర్ తరలించారన్నారు. ఇప్పుడు అవి కూడా క్యాంపు ఆఫీసులో లేవనీ, ఆయన కుమారుడి షోరూమ్ లో వాడుకుంటున్నారన్నారు. ఇది చాలా పురాతనమైన ఫర్నిచర్ అనీ, స్వతంత్రం రాకముందు కొనుగోలు చేసుంటారనీ, దాని విలువ ఇప్పుడు కోట్లలో ఉంటుందనీ, లక్షలు కాదని అంబటి రాంబాబు అన్నారు!
అసెంబ్లీ ఫర్నిచర్ కి కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంబటి అంచనా వేశారు. కేసు నమోదైందని ఆయనే చెబుతున్నారు, కానీ దానిపై స్వయంగా ఆయనే దర్యాప్తు చేస్తున్నట్టు ఇలా మాట్లాడుతున్నారు? మాజీ స్పీకర్ కీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ఇదనీ దీన్లో ముఖ్యమంత్రి జోక్యం ఉండదనీ ఆయనే చెబుతున్నారు… కానీ, ఒక నాయకుడిగా ఆయన జోక్యం చేసుకుని ఇలా లెక్కలు కనుక్కున్నారు! పోయిన ఫర్నిచర్ విలువ ఎంత అనేది అంబటి లెక్క కట్టాల్సిన అంశం కాదు కదా! కోడెల ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆయన కోట్ల విలువ చేసే వస్తువులు కొట్టుకెళ్లిపోయారంటూ ఈ సందర్భంలో తనకు తోచిన లెక్కలు కట్టి విమర్శించడం ఎంతవరకూ సమంజసమో ఆయనకే తెలియాలి.