పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుల్ గుస్సాతో ఉన్నారు! ఎంపీ రేవంత్ రెడ్డితో మొదలైన కోల్డ్ వార్ ఇప్పుడు బయటపడుతోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ కి అవకాశాలుండటంతో ఉత్తమ్ ఆగ్రహించడం మొదలుపెట్టారు. అధిష్టానం దగ్గరకి వెళ్లి, హుజూర్ నగర్ ఉప ఎన్నిక అయ్యే వరకూ తనని మార్చొద్దంటూ విన్నవించుకున్నారు. అంతేకాదు, ఢిల్లీ పెద్దలెవ్వరూ కొన్నాళ్లపాటు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వొద్దని కూడా చెప్పారని సమాచారం. అక్కడితో ఆగట్లేదు… రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నవారి నోటికి తాళం వేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఎవ్వరూ మీడియాలో కనిపించకూడదు! టీవీ ఛానెళ్లు పెడుతున్న చర్చా కార్యక్రమాలకు వెళ్లకూడదు, ఎలాంటి ప్రకటనలూ చేయకూడదంటూ పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశం అని కొంతమంది నాయకులు చెబుతున్నా… ఇది పూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత ఆదేశాల మేరకే వెలువడ్డ ప్రకటనగా తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ భార్యని అభ్యర్థిగా ప్రకటించడంపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరువాత, రేవంత్ కి మద్దతుగా కొంతమంది మాట్లాడటం మొదలుపెట్టారు! ఓ టీవీ ఛానెల్ చర్చలో పీసీసీ నాయకుడు మానవతారాయ్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ప్రజల నాయకుడనీ, ఆయనకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంలో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలుండవని వ్యాఖ్యానించారు. ఇలానే మరికొందరు వివిధ ఛానెల్స్ లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోపం తెప్పించాయట! అందుకే మీడియాలో చర్చలకు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఉంది, త్వరలోనే మున్సిపోల్స్ ఉన్నాయి, ఈ నేపథ్యంలో మీడియా చర్చల్లో కాంగ్రెస్ వాయిస్ లేకపోతే ఎలా అని సొంత పార్టీకి చెందిన కొందరు తాజా ఆదేశాలపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే పార్టీ సంక్షోభంలో ఉందనీ, ఇలాంటి ఆదేశాలతో ప్రజలకు మరింత దూరం అవుతామనీ, ఈ పరిస్థితి భాజపా పూర్తిగా అనుకూలంగా మార్చేసుకుంటుందని అంటున్నారు. పీసీసీ ఆదేశాలపై రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలియకుండా నిర్ణయాలు జరిగిపోతున్నాయన్న ఆవేదనలో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి టచ్ లోకి వెళ్తారా అనేది చూడాలి.