రాయలసీమకు హైకోర్టును తరలించబోతున్నారా…? అంటే.. అవునని… ఆంధ్రప్రదేశ్ న్యాయవాద వర్గాలు… చెబుతున్నాయి. వారికి కచ్చితమైన సమాచారం వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు… న్యాయవాదులంతా.. ఆందోళనలు ప్రారంభించారు. హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలని నిరసనలు చేస్తున్నారు. శుక్రవారం నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. రాయలసీమకు హైకోర్టు తరలింపు విషయంపై… ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం వారు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకూ.. ఆందోళన కొనసాగిస్తారమని బార్ అసోసియేషన్ ప్రకటన చేసింది.
రాజధానిని వికేంద్రీకరించాలనుకుంటున్న ఏపీ సర్కార్.. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలనుకుంటోందని న్యాయవాద వర్గాలకు గట్టి సమాచారం అందింది. అయితే ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన మ్యాటర్ కాదు. కేంద్రం నిర్ణయం కూడా కీలకమే. కేంద్రం కూడా.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రొత్సహిస్తోందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేసిన తప్పు చేయరని… తాను అనుకుంటున్నానని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ కర్నూలుకు వెళ్లి ప్రకటించారు. అక్కడ హైకోర్టు కోసం జరుగుతున్న ఆందోళనలకు మద్దతు పలికారు. నిజానికి రాయలసీమ ఉద్యమం, హైకోర్టు లాంటి వాటి కోసం.. జరిగే ఆందోళనల వెనుక.. ఉండేది.. ప్రధానంగా… వైసీపీనే. ఆ పార్టీ మద్దతుతోనే ఓ వర్గం ఈ ఆందోళనలను చేపట్టేది. సాధారణంగా… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ఇవి జరుగుతాయి. తర్వాత సద్దుమణిగిపోతాయి. కానీ ఇప్పుడు… హైకోర్టు కోసం కర్నూలులో ఆందోళనలు జరుగుతున్నాయి. బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఎలాంటి ప్రకటనలు చేయకపోతూండటం… ప్రజల్లో అనేక సందేహాలకు కారణం అవుతోంది. ఓ వైపు రాజధాని విషయంలో.. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎవరికీ తెలియడం లేదు. మరో వైపు ఆయన పార్టీ మద్దతుదారులు హైకోర్టు కోసం ఆందోళన చేస్తున్నారు. అమరావతిలో రాజధాని ఉండటం జగన్ కు ఇష్టం లేదన్న జీవీఎల్ లాంటి వాళ్లు… హైకోర్టును … కర్నూలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటితో… న్యాయవాద వర్గాల్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టవచ్చు కానీ.. ప్రజలకు మాత్రం.. ఏం జరుగుతుందో చెప్పడం.. కనీస బాధ్యత.