ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం వారానికో మెడిసిన్ ప్రయత్నిస్తోంది. సమస్య కళ్ల ఎదుట కనిపిస్తున్నా… అసలు దానికి వేయాల్సిన మందును మాత్రం వేయడం లేదు. దేశంలో ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గిపోయింది. బిస్కెట్ల నుంచి అండర్వేర్ల వరకూ పడిపోయిన అమ్మకాలే దానికి సాక్ష్యం. అలాంటప్పుడు.. ఏ ప్రభుత్వం అయినా… ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నం చేస్తుంది. మాంద్యం భయంతో… ఖర్చులు బిగపట్టుకుంటున్న ప్రజలకు… ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిత్యావసరాలు.. ఇతర వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గించి… మార్కెట్లో కదలికలు పెంచుతుంది. కానీ కేంద్రం మాత్రం అందుకు భిన్నంగా.. స్టాక్ మార్కెట్కు… డ్రగ్స్ ఇచ్చేసింది.
ఆటోమోబైల్ పరిశ్రమ.. జీఎస్టీ తగ్గింపు కోసం చూస్తోంది. నిత్యావసర వస్తువులు.. డిమాండ్ పడిపోయిన ఇతర రంగాలు.. తమకు ఉద్దీపన ప్యాకేజీలు అక్కర్లేదని.. పన్నులు తగ్గిస్తే చాలని.. అనుకుంటున్నాయి. సామాన్య ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. కానీ.. కేంద్రం మాత్రం.. దూకుడైన ప్రకటనతో ముందుకు వచ్చింది. కార్పొరేట్లకు… పన్నులు కోసింది. ఆ రిలీఫ్.. వారికి బాగా కిక్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్లో జోష్ తెచ్చింది. కార్పొరేట్లకు కేంద్రం ప్రకటించిన పన్ను రాయితీల విలువ ఏకంగా లక్షన్నర కోట్లని అంచనా. కార్పొరేట్ల పన్ను తగ్గించడం వల్ల.. ఆ మొత్తం స్టాక్ మార్కెట్లలోకి వెళ్లింది కానీ.. అసలు మార్కెట్లలోకి వస్తుందా..అని.. మార్కెట్ నిపుణులే వ్యక్తం చేసే విస్మయం.
కేంద్ర ప్రభుత్వం అసలు సమస్యను పట్టించుకోకుండా.. షార్ట్ కట్ మార్గాల ద్వారా.. తాత్కాలిక ప్రయోజనాలనే ఆశిస్తోందన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. అమెరికాలో మోడీ పాల్గొననున్న హౌడీ..మోడీ కార్యక్రమం సక్సెస్ అయ్యేందుకు దేశంలో పరిస్థితి బాగుందని చెప్పేందుకు.. ఈ నిర్ణయం తీసుకుని స్టాక్ మార్కెట్ ను పరుగులు పెట్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల వినియోగశక్తి పెంచి… నిజమైన వస్తు మార్కెట్లలో జోష్ తేవాల్సిన కేంద్రం.. స్టాక్ మార్కెట్ కు మాత్రమే… పరిమితం కావడం… దేశ ఆర్థిక వ్యవస్థకు… తీరని నష్టం చేస్తుందని అంటున్నారు.