చిత్తూరు మాజీ ఎంపీ నరమల్లి శివప్రసాద్ చెన్నై ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు.. క్లాస్ మేట్ అయిన .. శివప్రసాద్.. నటుడిగా.. నిర్మాతగా పేరు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. శివప్రసాద్ వైద్యుడు. చిన్ననాటి నుంచి నటనపై మక్కువ ఏర్పడింది. మెడిసిన్ పూర్తయ్యాక ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో రంగస్థలంపైకి అడుగుపెట్టారు. నటనలో రాణించారు. అక్కడి నుంచి సినీరంగ ప్రవేశం చేశారు. అక్కడా కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయకుడిగా విభిన్న పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకత్వంలోనూ ప్రతిభ చాటారు.
నటుడిగా రాణిస్తున్న సమయంలో తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ సాంస్కృతిక విభాగంలో పనిచేశారు. పార్టీ పథకాల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు 1998లో తిరుపతి పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో శివప్రసాద్ ఓడిపోయారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో సత్యవేడు నుంచి అసెంబ్లీ టిక్కెట్ లభించింది. గెలిచారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.
రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నాసరే… నాటకం ఉందంటే వచ్చేస్తారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో జరిగే నాటకాలలో దుర్యోధనుడు, భీముడు, కృష్ణుడు, కుచేలుడు… ఇలా ఏదో ఒక పాత్రని పోషించి ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకుంటుంటారు. ఆయన ఏ పాత్ర పోషించినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారన్న పేరుంది. ఆయన అభిమానులైతే… ఆయా పాత్రల ఫ్లెక్సీలను కూడా ఏర్పాటుచేస్తుంటారు. రాష్ట్ర విభజన, ఏపీకి ప్రత్యేకహోదా వంటి సున్నితమైన అంశాల విషయంలో కూడా ఎంపీగా తమ ఆవేదనను, ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని వివిధ పాత్రల ద్వారానే శివప్రసాద్ కేంద్రం ముందు వ్యక్తంచేశారు. వారం రోజుల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను.. కుటుంబసభ్యులు… ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
ప్రముఖ హీరోయిన్, ప్రస్తుత ఎమ్మెల్యే రోజాను.. శివప్రసాద్ హీరోయిన్ గా పరిచయం చేశారు. ప్రేమ తపస్సు సినిమా ద్వారా దర్శక నిర్మాతగా.. రోజాకు సినీ తెరకు పరిచయం చేశారు. అక్కడ్నుంచి రోజా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. మొత్తంగా దర్శకుడిగా నాలుగు సినిమాలను… శివప్రసాద్ తెరకెక్కించారు. రోజా – రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లోనే.. టోపీ రాజా.. స్వీటీ రోజా తీశారు. ఇల్లాలు, కొక్కోరకో అనే మరో రెండు సినిమాలు కూడా తన దర్శకత్వంలో తీశారు. నటుడిగా కూడా.. ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన చివరి సినిమా సైఆట. కృష్ణవంశీ తీసిన డేంజర్, నాని పిల్ల జమిందార్ వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు అందర్నీ ఆకర్షించాయి.