రూ.300 కోట్ల పనుల్లోనే రూ.58 కోట్లు ఆదా చేశాం. పోలవరం మొత్తం మీద ఇక మిగిలిన పనుల్లో రూ. 600 కోట్లు ఆదా చేస్తామని.. జలవనరుల మంత్రి అనిల్ కుమార్ గాల్లో చిటికెలు వేసి చెప్పారు. ఇప్పుడు… హెడ్ వర్క్స్ రివర్స్ టెండర్లలో.. ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకపోయినా.. కేవలం డీడీలు తీసుకొచ్చి.. టెండర్లలో పాల్గొనాలని చెప్పినా… చివరికి రేసులో మేఘా కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఒక్కటే మిగిలింది. అసలు రివర్స్ టెండర్ల లక్ష్యం.. ధరలు తగ్గించడం. ఒక్కటే బిడ్డర్ ఉన్నప్పుడు.. అదెలా సాధ్యమన్నది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రశ్న.
ప్రీబిడ్ సమావేశానికి దాదాపు ఎనిమిది సంస్థలు హాజరై సందేహాలు నివృత్తి చేసుకున్నా, గడువు ముగిసే నాటికి మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఒక్కటే బిడ్ వేసింది. దీంతో సింగిల్ టెండర్ మాత్రమే దాఖలైనట్లయింది. పోలవరం ప్రధాన జలాశయం వద్ద మిగిలి ఉన్న పనులకు రూ.1,771.44 కోట్లు, 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులకు రూ.3,216.11 కోట్ల అంచనా విలువతో జలవనరులశాఖ టెండర్లు ఆహ్వానించింది. ఇవన్నీ గత కాంట్రాక్ట్ కంపెనీ నవయుగ చేస్తున్న ధరలే. ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఈ నెల 23 సోమవారం ఆర్థిక బిడ్ తెరవాలి. రివర్స్ టెండర్లు నిర్వహించాలి.
కాంట్రాక్టుల విషయంలో ఒకే టెండర్ దాఖలయితే.. దాన్ని ఓకే చేయాలంటే… అంచనాల కన్నా తక్కువకు చేయడానికి ముందుకు రావాలి. ఇక్కడ రివర్స్ టెండరింగ్ చేయడానికి అసలు మరో బిడ్డర్ పోటీలో లేరు. ఇప్పుడు ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేయకుండా మళ్లీ రీటెండర్ పిలిచి అప్పుడు కూడా ఒకరే బిడ్ వేస్తే అప్పుడు ఓకే చెయ్యవచ్చు. ఒకవేళ ఎక్కువ మంది టెండర్లు చేస్తే రివర్స్ టెండరింగ్ చేయవచ్చు. కాదు ఇప్పుడే ఓకే చెయ్యాలనుకుంటే మేఘాతో.. చర్చలు జరపవచ్చు. ప్రభుత్వం ఇప్పుడు ఇదే చేసి..ఎంత తగ్గించాలనుకుంటే అంత తగ్గించి… ఆదా చేశామని ప్రకటించవచ్చు. ఇప్పటికే మేఘాతో.. కాంట్రాక్ట్ ఎంతకు తీసుకోవాలో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.