అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ ముందుగా హైకోర్టును కర్నూలు తరలించడానికి ఏర్పాట్లు చేస్తోందని ఢిల్లీ న్యాయవర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో అమిత్ షాతో కొద్దిరోజుల కిందట జరిగిన సమావేశంలో.. జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై చర్చించారని.. జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరో వైపు బీజేపీ కూడా దానికి సానుకూలంగా ఉంది. అక్కడ సెంటిమెంట్ పెంచడానికి… బీజేపీ తన వంతు ప్రయత్నం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం… బీజేపీ నేతలు… రాయలసీమలో సమావేశమయ్యారు. ఎజెండా ఏమిటో ఎవరికీ తెలియనివ్వలేదు. కానీ ఏపీ సర్కార్.. రాయలసీమకు హైకోర్టు మార్చాలనుకుంటోందని.. దానికి తగ్గట్లుగా.. రాయలసీమ నేతలు.. గ్రౌండ్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్న సందేశం వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ జిల్లాల న్యాయవాదులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. వీరికి జీవిఎల్ , టీ.జీ. వెంకటేష్ లాంటీ బిజేపి ఎంపీలు మద్దతు ప్రకటించారు.
ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన ఎంపీలతో కలిసి.. రాయలసీమలో సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేస్తామని.. జీవీఎల్ కూడా ప్రకటించారు. గతంలో ఎప్పుడూ చేయని విధంగా బీజేపీ నేతలు ఎందుకు హడావుడి చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. దీనికి కారణం… హైకోర్టు తరలింపేనని… న్యాయవాదులు నమ్ముతున్నారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ.. మంత్రి బొత్స ప్రకటించిన తర్వాత రాజధాని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లాయర్లకు వచ్చింది. హైకోర్టును రాయలసీమకు తరలిస్తారనే ప్రచారం న్యాయవాదులలో ఆందోళన రేపింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కావాలంటూ ఐదు జిల్లాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు.
పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా వరకూ గల బార్ ఫెడరేషన్లతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ గవర్నర్ విశ్వభూషణ్హరిచందన్ను కలిసి వినతిపత్రం ఇచ్చింది. ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపన అందజేయాలని వారు ప్రయత్నించారు. కానీ వారికి సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదు. ప్రభుత్వం హైకోర్టు విషయం లో స్పష్టమైన ప్రకటన చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అమరావతి విషయంలో వ్యవహరించినట్లుగానే… గుంభనంగా ఉంటోంది.