ప్రభుత్వాలన్నాక ప్రజల కోసం పథకాలు అమలు చేస్తాయి, చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని, కేంద్రం కొన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్రంలో అమలు చేసేవి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీవిగా, కేంద్రం అమలు చేస్తున్నవి అధికారంలో ఉన్న జాతీయ పార్టీవిగా చూడకూడదు. రాష్ట్రంలో కేంద్ర పథకాలను వద్దనడం, కేంద్రం కంటే మన దగ్గరే పథకాలు బాగున్నాయనడం… సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ధోరణి. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ… కేంద్ర పథకాలు – రాష్ట్ర పథకాల మధ్య పోలికలు తీసుకొచ్చారు.
రాష్ట్రంలో వచ్చేస్తామని భాజపా నాయకులు చెబుతున్నారనీ, వస్తే ప్రజలు బతుకులు ఆగమాగమైతాయని కేసీఆర్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ పోయి, ఆయుష్మాన్ భారత్ వస్తుందన్నారు. రైతుబంధు పోయి, కిసాన్ సమ్మాన్ వస్తుందనీ, సమ్మాన్ మాత్రమే ఉంటుందని కిసాన్ ఏమీ రాదని ఎద్దేవా చేశారు. కిసాన్ సమ్మాన్ పథకంలో రైతుకు వచ్చేది ఆరేవేలన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకి పదివేలు ఇస్తోందన్నారు. భాజపా వస్తే రైతు బీమా ఉండదన్నారు. ఒక్క భాజపా పాలిత రాష్ట్రంలోనైనా రూ. 2016 పెన్షన్ ఉందా, కేసీఆర్ కిట్ ఉందా, కల్యాణ లక్ష్మి పథకం ఉందా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం మహారాష్ట్రలో భాజపా అధికారంలో ఉందనీ, కానీ నాందేడ్ జిల్లాకి చెందిన కొన్ని గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలుస్తామని తీర్మానాలు చేశాయంటూ ఆ పార్టీ పాలన ఎంత బాగుందో అర్థమౌతోందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ధోరణి ఎలా ఉందంటే… కేంద్ర పథకాలు అమల్లోకి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నవి ఆగిపోతాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. కిసాన్ సమ్మాన్ గానీ, ఆయుష్మాన్ భారత్ గానీ అమలు చేయకపోవడానికి కేవలం రాజకీయ కారణాలే. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పనే కదా? రైతు బంధుతో ఎకరాకి పదివేలు ఇస్తుంటే… కిసాన్ సమ్మాన్ తో వస్తున్న రూ. 6 వేలు కూడా అదనంగా కలిపి ఇవ్వండి… ఎవరొద్దన్నారు? కేంద్ర పథకం అమలు చేయడమంటే… రాష్ట్రంలో తెరాసకు బదులు భాజపా పాలనలోకి వచ్చేస్తుందన్నంత తీవ్రంగా పరిస్థితి భూతద్దంలో సీఎం కేసీఆర్ చూపిస్తున్నారు. కేంద్ర పథకాలు అమలైతే వాటి ద్వారా జరిగే లబ్ధి గురించి భాజపా ప్రచారం చేసుకుంటుందనే కోణం నుంచి మాత్రమే ఆలోచిస్తూ మోకాలడ్డుతున్నారు. కేంద్రం అంటే భాజపాది, రాష్ట్రమంటే తెరాసది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పథకాల మధ్య పోలిక ఎందుకు, ఎవరు అమలు చేయాల్సినవి వారు చెయ్యాల్సిందే!