తెలుగు సినిమాకి ఖ్యాతి తీసుకొచ్చిన సినిమాలు చెప్పమంటే శంకరాభరణం తప్పకుండా గుర్తొస్తుంది. ఆ జాబితాలో బాహుబలి కూడా చేరుతుంది. అదే స్థాయిలో `సైరా` కూడా ఉండబోతోందని చిరంజీవి విశ్వాసంగా చెబుతున్నారు. ఆయన నటించిన 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. అక్టోబరు 2న విడుదల కాబోతోంది. ఈరోజు రాత్రి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్, రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటించాలని ఎప్పటి నుంచో ఉండేదని, కానీ తన దగ్గరకు ఎవరూ అలాంటి కథలు తీసుకురాలేదని గుర్తు చేసుకున్నారు చిరు. పుష్కరకాలం క్రితం పరుచూరి బ్రదర్స్ తన దగ్గరకు ఈ కథ తీసుకొచ్చారని, అప్పట్లో ఈ సినిమాకి 60 – 70 కోట్ల బడ్జెట్ అయ్యుండేదని, కానీ తన మార్కెట్ అంతగా లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదన్నారు. బాహుబలికి వచ్చిన వసూళ్లు చూశాకే సైరా తీయగలం అన్నధైర్యం కలిగిందని, ఈ సందర్భంగా రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు చిరంజీవి. ”చాలా సినిమాలువిజయవంతం అవుతాయి. అందులో కొన్ని మాత్రమే గర్వకారణంగా నిలబడతాయి. నేను పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో `శంకరాభరణం` అలాంటి గౌరవాన్ని కలిగించింది. ఎక్కడకువ ఎళ్లినా ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఆ తరవాత చాలా మంచి సినిమాలొచ్చాయి. కానీ బాహుబలి తో తెలుగువాళ్లు గర్వంగా కాలర్ ఎత్తుకుని నిలబడ్డారు. అలాంటి గౌరవం సైరా తీసుకొస్తుందని నా నమ్మకం” అన్నారు చిరంజీవి. అయితే తాను రికార్డుల గురించి మాట్లాడడం లేదని, కేవలం గౌరవం గురించే చెబుతున్నానని చిరు ఈ సందర్భంగా నొక్కి వక్కానించడం విశేషం.