ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తీయాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. దాదాపు ఈ కథ పదిహేనేళ్ల నుంచీ నలుగుతూనే ఉంది. దర్శకులుగా కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. ఓ దశలో వినాయక్ ఈ సినిమా చేస్తాడని చెప్పుకున్నారు. చివరికి సురేందర్ రెడ్డికి ఈ అవకాశం దక్కింది. నిజానికి.. ఈ సినిమాకి డైరక్షన్ చేయాలన్న ఆలో్చన చిరుకి కూడాఉండేదట. ఈ సినిమాకి మీరే దర్శకత్వం వహించండి అంటూ పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్లు సలహా ఇచ్చార్ట. కానీ చిరంజీవి మాత్రం ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని `సైరా` ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా గుర్తు చేసుకున్నారు చిరంజీవి.
”నటన దర్శకత్వం రెండు పనులూ ఒకేసారి చేయడం సాధ్యం కాదు. అయితే డైరక్షన్, లేదంటే నటన. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకుంటాను అని చెబితే.. పరుచూరి బ్రదర్స్ కంగారు పడ్డారు. ‘మీరు నటించండి.. డైరక్షన్ వద్దు’ అన్నారు. ధృవ తరవాత సురేందర్‌రెడ్డి పనితనం తెలిసింది. ఈ సినిమాకి తనైతే న్యాయం చేస్తాడని చరణ్ చెప్పాడు. సురేందర్‌రెడ్డిని పిలిచి సినిమా చేతుల్లో పెడితే ఎగిరి గంతేస్తాడనుకున్నాం. కానీ రెండు నెలలు సమయం కావాలి అని మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు. రెండు నెలల తరవాత తిరిగొచ్చి `నేను చేస్తా`అని చెప్పడం సంతోషం కలిగించింది. చరిత్రని ఎక్కడా వక్రీకరించకుండా చక్కటి వాణిజ్య విలువలతో ఈ సినిమాని తెరకెక్కించాడ”న్నారు చిరంజీవి.