ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 144 సెక్షన్ సర్కార్ అనే ముద్ర పడిపోతుంది. మాట కంటే ముందు.. ఎక్కడ పడితే అక్కడ 144 సెక్షన్ పెట్టినట్లు ప్రకటనలు చేయడమే దీనికి కారణం. మూడున్నర నెలల కాలంలో… ఇన్సిడెంట్ జరిగిన ప్రతీ చోటా… 144 సెక్షన్ పేరుతో.. ప్రజల్ని కట్టడి చేయడానికి ప్రయత్నించారు. అవి బాధితుల్ని మరింత రెచ్చగొడతాయని… కనీసం ఆలోచన కూడా చేయడం లేదు.
ముందుగా ముఖ్యమంత్రి ఇంటి దగ్గరే 144 సెక్షన్ ..!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పటయిన తర్వాత… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి దగ్గరకు జనం తండోపతండాలుగా వచ్చారు. మొదట… వారం రోజులు.. ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేవారు. తర్వాత కొన్ని సమస్యలతో రావడం ప్రారంభించారు. పాదయాత్ర లో ఆయన ఇచ్చిన హామీలను .. వాటికి సంబంధించిన పేపర్ కటింగ్లతో ఆయన ఇంటికి వెల్లువలా రావడం ప్రారంభించారు. మొదట్లో వచ్చిన వారికి.. జగన్ అక్కడిక్కడ పరిష్కారాలు చూపించినట్లుగా ప్రచారం జరిగింది. దాంతో.. వచ్చే వారు రాను రాను ఎక్కువైపోయారు. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టమయింది. పదంటే పది రోజుల్లోనే… తాడేపల్లి నుంచి.. ముఖ్యమంత్రి నివాసం వరకూ 144 సెక్షన్ విధించారు. ఎవర్నీ గుమికూడనీయడంలేదు. సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారిని మంగళగిరిలోనే అడ్డుకుంటున్నారు. అరెస్ట్ చేస్తున్నారు. దాంతో.. టీడీపీ నేతలు కూడా.. విమర్శలు ప్రారంభించారు. ప్రజల్లోకి రావడానికి జగన్ భయపడుతున్నారని.. ప్రజల్ని కూడా తన ఇంటి దగ్గరకు రానీయడం లేదని విమర్శలు ప్రారంభించారు.
టీడీపీ, బీజేపీ ఆందోళనలే కాదు.. కోడెల అంత్యక్రియలకూ 144 సెక్షన్..!
వైసీపీ కార్యకర్తల దాడులకు భయపడి ఊరు వదిలి పోయిన వారిని మళ్లీ సొంత ఊళ్లలో విడిచి పెడతామని… చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీని అడ్డుకోవడానికి పోలీసలకు దొరికిన ఒకే ఒక్క ఆప్షన్ 144 సెక్షన్. దీనికి పోలీస్ యాక్ట్ 30ని కూడా అక్కడ అమలు చేశారు. అక్కడకు ఎవరినీ పోనివ్వకుండా అడ్డుకున్నారు. అదో పెద్ద రగడకు దారి తీసింది. ఆ తర్వాత గురజాలలో… బీజేపీ సభ పెట్టుకుంటే అదే పరిస్థితి. అక్కడా 144 సెక్షన్ అమలు చేసి.. అందర్నీ అరెస్ట్ చేశారు. కన్నా లక్ష్మినారాయణను కూడా.. పోనివ్వలేదు. చివరికి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుంటే… వెంటనే.. నర్సరావుపేట డివిజన్ మొత్తం 144సెక్షన్ విధించారు. అంత్యక్రియలకు ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తడంతో.. అంత్యక్రియలకు ఆటంకం కాదని.. కానీ 144 సెక్షన్ మాత్రం కొనసాగుతుందని ప్రకటించారు.
ఇప్పుడు.. కచ్చులూరు సముద్రంలోనూ 144 సెక్షన్..!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుందని అనుమానం వచ్చినా.. వెంటనే… పోలీసులు 144 సెక్షన్‌తో రంగంలోకి దిగిపోతున్నారు. బోటు ప్రమాదం జరిగిన కచ్చులూరు అనే గ్రామ పరిధిలో 144 సెక్షన్ విధించారు.ఇంతా చేసి.. ఆ గ్రామంలో నాలుగైదు వందల మంది కూడా.. నివాసం ఉండరు. బోయును తీయలేక ప్రభుత్వం చేతులెత్తేయడంతో… ఇప్పటికీ.. జాడ తెలియని వారి బంధువులు వచ్చి రచ్చ చేస్తారన్న భయంతో.. ఆ గ్రామంలోనూ.. 144 సెక్షన్ విధించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సహాయశిబిరాన్ని కూడా ఎత్తేశారు. అంటే.. గల్లంతయిన వారిపై ఆశలు వదిలేసుకోమని చెప్పడమే. దీన్ని ఎక్కడ ప్రశ్నిస్తారోనని పోలీసులు 144 సెక్షన్ తో రంగంలోకి దిగిపోయారు.
నిర్బంధాలపై ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు తట్టుకోలేవు..!
చరిత్ర చెప్పిన సత్యం ఇదే. ప్రజాస్వామ్యంలో.. నిర్బంధాలను ప్రజలు ఏ మాత్రం సహించరు. తమ శాంతియుత ఆందోళనలను కూడా… పోలీసు బలంతో అణగదొక్కాలని చూస్తే… వారిలో అసహనం పెరిగిపోతుంది. అది నిర్బంధాలు పెరిగే కొద్దీ తీవ్రమవుతుంది కానీ.. తగ్గే అవకాశం ఉండదు. ఈ విషయంలో ప్రభుత్వం జాగూరుకతతో వ్యవహరించాల్సి ఉంది. పోలీసునిర్బంధాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.