విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించారు. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులేకే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాల సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రులు.. మిగతా వాటిపై దృష్టి పెట్టారు. నదీ జలాల వివాదం, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్ లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన, ఉన్నత విద్యామండలి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, విద్యుత్ బకాయిలు వంటి అంశాలను పరిష్కరించుకోవాలనుకున్నారు. ఆ తర్వాత కొన్ని సమావేశాలు.. గవర్నర్ సమక్షంలో చర్చలు జరపాలనుకున్నప్పటికీ ముందడుగు పడలేదు.
సరిహద్దు కాలువ నిర్మాణంపై నిర్ణయానికేనా..?
గోదావరి జలాలను.. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎలా తరలించాల్ననదానిపైనే… ప్రధానంగా.. జగన్ – కేసీఆర్ మధ్య చర్చ జరగనుందని చెబుతున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్ల కమిటీ.. కొన్ని ప్రత్యామ్నాయలను సిద్ధం చేసిందంటున్నారు. చాలా ప్లాన్లు వేసినప్పటికీ .. చివరికి.. పోలవరం బ్యాక్ వాటర్‌ను తీసుకోవడమే ఉత్తమ మార్గమని ఉత్తమమని తెలంగాణ ఇంజనీర్ల కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కాలువ తవ్వి, నీటిని గ్రావిటీ ద్వారా పులిచింతల దిగువకు చేరుస్తారు. అక్కడి నుంచి పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలానికి నీటిని ఎత్తిపోస్తారు. ఇదే అన్నింటి కన్నా ఉత్తమ ప్రతిపాదనగా తేల్చారు. దీన్ని ఏపీ సీఎం ఎదుట ఉంచే అవకాశం ఉంది. పోలవరం ఎత్తు తగ్గింపు అంశం కూడా ఎజెండాలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్ చెప్పినందున.. దీనిపైనా నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. మహారాష్ట్ర ఫార్ములాని కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కూడా తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడమే కాకుండా సుప్రీంకోర్టులో కేసులు కూడా ఉన్నాయి. ఇటువంటి వివాదాలన్నింటినీ ఎత్తు తగ్గింపు ద్వారా పరిష్కరించే ఆలోచన చేస్తున్నారు. దీనిపై జగన్ స్పందన తెలియాల్సి ఉంది.
ఏపీకి రావాల్సిన వాటిపై క్లారిటీ వస్తుందా..?
హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను అప్పగించడంలో ఉదారంగా వ్యవహారించిన ఏపీ ప్రభుత్వం.. ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా జనాభా ప్రాతిపదికన పంపిణీయా లేదా విభజన చట్టంలో ఉన్న నిబంధనలకు మేరకు వెళ్దామా అనే అంశంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ అంశాలపై ఏసీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారులు పూర్తి వివరాలు అందజేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనను కూడా ఎజెండాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ భవన్ ను జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఏపీ అధికారులు గతంలో వాదించారు. అయితే ఏపీ భవన్ తెలంగాణ వారసత్వ ప్రతీక కావడంతో దాన్ని తమకే పూర్తిగా కేటాయించాలని, ఏపీ భవన్ ను నిర్మించేందుకు మరో ప్రతిపాదన కూడా చేయాలని తెలంగాణ అధికారులు గతంలో ప్రతిపాదించారు. విభజన తర్వాత ఏపీకి సంబంధించినంత వరకూ ఒక్కటంటే.. ఒక్క గుడ్ న్యూస్ రాలేదు. ఒక్క విభజన సమస్యకూ పరిష్కారం దొరకలేదు. చివరికి కరెంట్ బకాయిల గురించి కూడా అడగడం లేదు. ఈ భేటీతో అయినా పరిష్కారం లభిస్తుందో లేదోనన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
సీఎంల సమావేశం ఎజెండాపై అంత సీక్రెట్ ఎందుకు..?
ముఖ్యమంత్రుల మధ్య సమావేశం ఎజెండాసీక్రెట్ గా ఉంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య.. మూడు నెలల్లో ఏడో సారి సమావేశం జరుగుతోంది. గెలిచిన తర్వాత ప్రగతి భవన్‌కు.. జగన్ వెళ్లారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు.. జగన్ కేసీఆర్‌ను తన ఇంటికి తోడ్కొని పోయి విందు ఇచ్చి చర్చలు జరిపారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందులో కలసిమెలిసి చర్చలు జరిపారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి కేసీఆర్ విజయవాడ వచ్చారు. మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద కలిశారు. ఆ తర్వాత ఓ సారి ప్రగతి భవన్లో రోజంతా కీలక చర్చలు జరిపారు. మరోసారి ప్రగతి భవన్లో భేటీ అవుతున్నారు. ఇంత తరచుగా.. ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా.. సమావేశమై ఉండరు. వివాదాలను కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ముఖాముఖిగా కూర్చొని చర్చించుకోవాలంటే.. ఇంత కంటే మంచి మార్గం ఉండదని.. నమ్ముతున్నారు.