అమెరికాలో హాట్ టాపిక్ అయింది. హూస్టన్ మొత్తం ఊగిపోయింది. యాభై వేల మంది భారతీయ అమెరికన్లు గుమికూడారు. అందులో తెలుగు మాటలు కూడా వినిపించాయి. అంతా బాగుందని… తెలుగులో కూడా.. మోడీ ఇండియా నుంచి తెలుగువారికి.. క్షేమ సమాచారం కూడా అందించారు. ట్రంప్ రాక.. అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం… అన్నింటికీ మించి భారతీయ సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలు… ఓ రాక్ స్టార్ ఈవెంట్ కు ఏ మాత్రం తగ్గని టెంపోని క్రియేట్ చేశాయి. బెస్ట్ ఫ్రెండ్స్ లా.. మోడీ, ట్రంప్ చేతిలో చెయ్యి వేసుకుని… భవిష్యత్ సూపర్ పవర్స్ గా కలసి పని చేస్తామని.. ప్రకటించారు.
ట్రంప్ – మోడీ .. చెట్టాపట్టాల్.. !
వేదికపై నుంచి నరేంద్రమోడీ పాకిస్థాన్నే ఎక్కువ టార్గెట్ చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ వేదికపై… పాకిస్తాన్ ను ఎండగట్టడానికి తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా ట్రంప్ ఎదుట.. సమర్థంగా తన వాదన వినిపించారు. పాకిస్తాన్ కు ఏ మాత్రం సాయం చేయాలన్నా.. మోడీ చేసిన వ్యాఖ్యల విషయాన్ని ట్రంప్ .. ఈ సారికి గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్లో ఉన్న పరిణామాలపైనా.. మోడీ ప్రవాస భారతీయులకు వివరించారు. కశ్మీర్ విషయం..అవినీతిపై జరుగుతున్న పోరాటాలనూ.. వివరించారు. కరతాళధ్వనులు పొందారు.
మోడీ నోట..” అబ్కీ బార్ ట్రంప్ సర్కార్..”
డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడవ్వాలనుకున్నారు. ఆయనకు మద్దతు ప్రవాస భారతీయులందర్నీ సమీకరించడానికే.. ఈ సభ పెట్టినట్లుగా ఉందన్న అభిప్రాయం చివరికి చాలా మందికి ఏర్పడింది. ఎందుకంటే.. మోడీ ట్రంప్ మళ్లీ గెలుస్తారన్నారు. మోడీ రెండో సారి గెలవడానికి కారణమైన… స్లోగన్ ..” అబ్కీ బార్ మోడీ సర్కార్..” ని మార్చి….” అబ్కీ బార్ ట్రంప్ సర్కార్..” గా పిలుపునిచ్చారు. దీంతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. నిజానికి ట్రంప్ ఎజెండా వల్ల.. ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చి.. అమెరికా పౌరసత్వం పొంది ఓటర్లుగా మారిన వారిలో ఆందోళన ఉంది. వారిలో భారతీయులు ఎక్కువ. ఈ కారణంగా.. ట్రంప్ కు మద్దతు సమీకరించేందుకు మోడీ ప్రయత్నించారని చెబుతున్నారు.
అమెరికాలో రికార్డు.. హౌడీ..మోడీ..!
అమెరికాలో ఓ విదేశీ నేత కార్యక్రమానికి ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు హాజరు కావడం.. ఇదే మొదటి సారి. యాభై వేల మందికిపైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణంగా.. రాజకీయాలకు సంబంధం లేదని పోప్ లాంటి వాళ్లు వచ్చినప్పుడు మాత్రమే.. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారు. ఇతర విదేశీ నేతల సభలకు ఈ స్థాయి ఏర్పాట్లు.. ఇంత భారీ స్థాయిలో హాజరు ఉండటం అరుదు.