గతంలో ఎన్నడూ లేనంత ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నారు టి. కాంగ్రెస్ నేతలు! గతం గతః, పాత విభేదాలు వదిలేసి అలాయ్ బలాయ్ అంటూ కౌగిలించేసుకుంటున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తామంతా ఒక్కటిగా తెరాసను ఎదుర్కొంటామని ప్రకటనలు చేస్తున్నారు. గతానికి భిన్నంగా, ఎన్నికల బాధ్యతల్ని పంచేసుకుని పని చేయడం మొదలుపెట్టారు. ఉప ఎన్నికల్లో వామపక్షాల మద్దతు కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపక్క ప్రయత్నిస్తుంటే, మరో నేత టీడీపీ సాయం కోసం మాట్లాడుతున్నారు! మరొకరు ప్రచారం ఎలా చేయాలో ప్లానింగ్ పనిలో ఉన్నారు. ఒక్కసారిగా పార్టీలో పని విభజన ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది! పిలిచినా వచ్చేందుకు వంకలు వెతుక్కునే నాయకులు, స్వచ్ఛందంగా భేషజాలను వదులుకుని ఐక్యతారాగం వినిపించడం చూడ్డానికి చాలా బాగుంది. కానీ, ఇది పార్టీకి పనికొచ్చే ఐకమత్యమా అంటే… కచ్చితంగా కాదు!
కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న కలిసికట్టుతనం ఎంపీ రేవంత్ రెడ్డి వల్లనే వచ్చింది. ఆయన్ని వ్యతిరేకించాలనే బలమైన భావనతో ఇది సాధ్యమైంది. ఇదేదో పార్టీని కాపాడుకునే ఐకమత్యం కాదు… పదవుల్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే! పీసీసీ పగ్గాలు చేజారిపోతాయేమో అనే అభద్రత ప్రేరేపించిన కలయిక ఇది. హైకమాండ్ దృష్టిలో రేవంత్ రెడ్డి ఉన్నారు, రాష్ట్రంలో పార్టీని మళ్లీ ట్రాక్ లోకి తేవాలంటే రేవంత్ నాయకత్వం అవసరమని కార్యకర్తలూ చాలామంది అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే, రేవంత్ చేతికి పీసీసీ పగ్గాలు కట్టబెట్టకుండా అడ్డుపడే ప్రయత్నమే ఇప్పుడు జరుగుతున్నది. ఎలాగైనాసరే, హైకమాండ్ దృష్టిలో నెగెటివ్ మార్కులు పడేలా చేస్తే, పీసీసీ ఆయనకి దక్కకుండా పోతుంది. ఇదే కొత్త స్నేహితుల ఐక్య అజెండాగా కనిపిస్తోంది.
ఇప్పుడు కనిపిస్తున్న స్నేహపూర్వక వాతావరణం పార్టీకి మంచిది కాదు. అన్ని విషయాల్లోనూ ఇదే చొరవ కనిపిస్తే మంచిదని విశ్లేషించే ఆస్కారం ఉండేది. రేవంత్ రెడ్డి దగ్గరకి వచ్చేసరికి ఇంతగా కలిసిపోయిన ఈ సీనియర్లు.. తెరాసను ఎదుర్కోవడంలో ఈ తరహా చొరవ ఎందుకు చూపలేదు? విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై ఆధారాలున్నాయని రేవంత్ చెప్పినా… ఆ పోరాటానికి ఇతర నాయకులు ఎందుకు సహకరించలేదు? రైతుల కోసం పాదయాత్ర అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయల్దేరేస్తుంటే… ఇతర నాయకులు ఎందుకు కలిసి వెళ్తామని ప్రకటనలు చేయడం లేదు? సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ ఐకమత్యం ఎందుకు సాధ్యం కాలేదు? తెరాస సర్కారు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారంటూ భట్టి విక్రమార్క ఒక్కరే ప్రెస్ మీట్లలో ఎందుకు గోడు వెళ్లగక్కుతారు? బైసన్ పోలో గ్రౌండ్లో కట్టడాలు వద్దని ఒక్క వీహెచ్ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తారు? అంతెందుకు… ఎన్నికల సమయంలో తెరాసను ఓడించే ప్రయత్నంలో ఈ ఐకమత్యం ఎందుకు సాధ్యం కాలేదు..?