కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. మొదటగా… గుంటూరు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం కుటుంబానికి చెందిన పొలాల్లో నిర్మించిన ఇంటిని.. సీఆర్డీఏ అధికారులు కూలగొడుతున్నారు. నదీ ప్రవాహం మీద వేసిన శ్లాబ్‌ను కూలీలు, ప్రొక్లెయినర్లను పెట్టి కూలగొడుతున్నారు. మూడురోజుల క్రితం.. చంద్రబాబు ఇంటితో పాటు.. మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. వారిలో పాతూరి కుటుంబం కూడా ఉంది. వారు నోటీసులకు సమాధానాలివ్వకపోవడంతో.. కూల్చివేతలు ప్రారంభించినట్లుగా సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు ఇంటి యజమాని… నిబంధనల ప్రకారమే ఇల్లు కట్టామని.. అన్ని రకాల అనుమతులు ఉన్నాయని.. స్విమ్మింగ్ ఫూల్ కు కూడా రివర్ కన్జర్వేటర్ అనుమతి ఉందని సీఆర్డీఏ అధికారులకు పత్రాలతో సహా సమాధానం పంపారు. దీనిపై.. సీఆర్డీఏ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారేది ఆసక్తికరంగా మారింది.
కరకట్టపై మంతెన ఆశ్రమంతోపాటు.. బీజేపీ నేత గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కూడా ఉంది. వాటితో పాటు పలువురు స్వామిజీలకు చెందిన వారి ఆశ్రమాలు.. మరికొన్ని నిర్మాణాలు ఉన్నాయి. తొలగిస్తే.. అన్నింటినీ తొలగించాల్సి ఉంది. అయితే.. అన్నింటికీ.. ఏదో ఓ రూపంలో అనుమతులు ఉన్నాయి. అనుమతులు లేని వాటిని మాత్రం సీఆర్డీఏ అధికారులు కూలగొడుతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుమతులు ఉండి కూలగొడితే.. న్యాయపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని.. సీఆర్డీఏ అధికారులు ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి చంద్రబాబు ఇంటిపైనే గురి పెట్టారు. ఆయన ఉంటున్నది అక్రమ కట్టడమంటూ… రచ్చ చేశారు. నోటీసులు ఇచ్చారు. మొదట్లో నోటీసులు ఇచ్చినప్పుడు.. అన్ని రకాల అనుమతులు ఉన్నాయని పత్రాలు బయటకు రావడంతో సైలెంటయ్యారు.
చంద్రబాబు ఇంటి పక్కన నిర్మించిన ప్రజావేదికను కూడా మొదట్లోనే కూల్చి వేశారు. దానిని తన నివాసంగా గుర్తించాలని చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నా.. అందులోనే కలెక్టర్ల సమావేశం నిర్వహించి… ఆ సమావేశం ముగిసిన వెంటనే.. కూల్చివేతకు ఆదేశించారు. ఇప్పటికీ ఆ శిధిలాలు అక్కడే ఉన్నాయి. మొన్నటి వరదల్లో… ఎనిమిది లక్షలకుపైగా క్యూసెక్కుల నీరు కృష్ణానదిలోకి వచ్చినా… చంద్రబాబు ఇంట్లోకి వరద రాలేదు. అయితే.. అప్పుడే చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని… చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఎలా అయినా సరే.. చంద్రబాబును అక్కడి నుంచి ఖాళీ చేయించడమే లక్ష్యంగా… ఏపీ సర్కార్.. ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. మొదటగా చంద్రబాబు ఇంటినే కూల్చేస్తే విమర్శలు వస్తాయని.. ఒకటి, రెండు ఇతరుల ఇళ్లపైనా.. కొంత కూల్చివేతలు చేసి.. ఆ తర్వాత చంద్రబాబు ఇంటి వద్దకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది.