కేసీఆర్ పాలన చూస్తుంటే అహా నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు తనకు గుర్తొస్తారనీ, కోడిని పైనగట్టి తెల్లన్నం తినేట్టుగా పాలన ఉందని ఎద్దేవా చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ఇంటింటికీ నల్లా, రుణమాఫీ, రైతులకు పెట్టుబడి… ఇవన్నీ ఎవరికైనా చేరాయా అంటూ తుర్కపల్లిలో రేవంత్ అని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల గౌరవం పెరగాలంటే పాలన మారాలన్నారు. సర్పంచులు, ఉప సర్పంచులకు మధ్య గొడవలు పెడుతున్నారన్నారు. చెక్ పవర్ ఇవ్వాలనుకుంటే సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలనీ, ఆ ప్రయత్నం చేయడం లేదంటే గొడవలు పెట్టాలన్నదే వారి కోరిక అన్నట్టుగా ఉందన్నారు.
తన పనులన్నీ ఇప్పుడు సెట్ అయిపోయాయనీ, ఖాళీగానే ఉన్నాననీ, ఇక నుంచి గ్రామాల్లో తిరగడానికే సమయం మొత్తం కేటాయిస్తా అన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలు తిరుగుతా అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎవరైతే ఓట్లేశారో, వారితోనే విమర్శలు చేపిస్తానన్నారు. ప్రజా ప్రతినిధులందరూ ఇప్పుడు ఒక్కసారి ఆలోచించాలనీ, గతంలో దక్కిన గౌరవం ఇప్పుడు దక్కుతోందా లేదా అని ఒక్కసారి చర్చించుకోవాలన్నారు. నాయకులకు ఇజ్జత్ లేకుండా చేసి, చేతిలో పైసలు లేకుండా గ్రామ పంచాయతీలు దివాలా తీసింది ఎవరునేది ఆలోచించాలన్నారు.
గ్రామాల్లో సమస్యల నేపథ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించేశారు! ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆయనంటే గుర్రుగా కొందరు సీనియర్లన్నారు. రేవంత్ కి ప్రాధాన్యత తగ్గించడమే అజెండాగా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో తానే పాదయాత్ర చేస్తానని రేవంత్ చెప్పడం చర్చనీయం అయ్యే అవకాశం ఉంది. అయితే, పార్టీలో ప్రస్తుతం ఎదురౌతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే పాదయాత్రకు రేవంత్ వ్యూహాత్మకంగా సిద్ధమౌతున్నారేమో అనిపిస్తోంది. రేవంత్ అవసరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉందని హైకమాండ్ గుర్తించినట్టు సంకేతాలున్నాయి. కానీ, పార్టీని ఆయన అవసరాన్ని రాష్ట్ర నేతలు ఒప్పుకునే పరిస్థితి లేదు! దాన్ని వారికి గుర్తు చేయడం కోసమే ఈ పాదయాత్రకు సిద్ధమౌతున్నట్టుగా ఉంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అభ్యర్థికి సంబంధించి రేవంత్ ప్రతిపాదనపై సీనియర్లు ఎలా స్పందించారో చూశాం! నిన్నమొన్న వచ్చినవారి మాటలకు పెద్ద విలువ ఇవ్వాల్సిన పనిలేదనేశారు. ఇప్పుడు, రేవంత్ పాదయాత్ర అంటే ఎలా స్పందిస్తారో చూడాలి.