ఒకే దేశం – ఒకే భాష, ఒకే దేశం – ఒకే ఎన్నిక… ఈ కోవలోకి.. ఒకే దేశం – ఒకే కార్డును కూడా చేర్చారు బీజేపీ అధ్యక్షుడు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమిత్ షా ఉద్దేశలో గుర్తింపు కార్డు. ఇప్పుడు ప్రతీ అంశానికి ఓ గుర్తింపు కార్డు ఉంటుంది. అంటే.. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు, పాన్ కార్డు , పాస్ పోర్టు ఇలా… అనేక కార్డులు ఉంటున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించి.. ఒకే కార్డులో నిక్షిప్తంగా చేసి.. ఒకే నెంబర్ ను.. పౌరులకు కేటాయించాలనే ఆలోచన ఉందని.. అమిత్ షా ప్రకటించారు. ఇవన్నీ సేవల కార్డులే కదా.. .. ఎటీఎం కార్డు.. క్రెడిట్ కార్డులు కాదు కదా.. అనే ఫీలింగ్ రావొచ్చు.. కానీ అమిత్ షా దీన్ని కూడా కొట్టి పడేశారు. బ్యాంక్ అకౌంట్, మనీ ట్రాన్సాక్షన్ సేవలు కూడా.. ఆ కార్డు ద్వారా పొందవచ్చట.
అమిత్ షా ఈ ప్రకటన ఆషామాషీగా చేయలేదు. చాలా ప్లాన్డ్ గానే… చేసారు. ఈ మల్టిపర్పస్ కార్డు వల్ల నేరాల నియంత్రణ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ సులువవుతుందని అంటున్నారు. ఓటర్ల జాబితాకు జనన, మరణ రిజిస్టర్లను ఆటోమేటిగ్గా లింక్ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అమిత్ షా చెబుతున్నారు. అయితే.. ఆధార్ పేరుతో పదేళ్ల కిందట తెచ్చిన వ్యవస్థ ఇప్పటికీ కుదురుకోలేదు. అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సమాచారం లీకవుతోందని.. ఫ్రాడ్ జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో.. ఒకే కార్డు ఆలోచనను.. అమిత్ షా ఆవిష్కరించడం.. కొంత ఆందోళన కలిగించే అంశమేనని నిపుణులు అంటున్నారు.
భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక జనాభా నివసిస్తున్న దేశాల్లో.. ఇలాంటి వాటి వల్ల మోసాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ మోసాలు ఇండియాలోనే అత్యధికంగా ఉంటున్నాయి. కేంద్రం వీటన్నింటినీ పరిగణనోలకి తీసుకుంటుందేమో చూడాలి..!