తెలంగాణలో కరువు ప్రాంతాలు, ఆంధ్రాలో రాయలసీమ ప్రాంతాలకు కృష్ణా గోదావరి జలాలను కలపడం ద్వారా కరువు లేకుండా చెయ్యొచ్చు అనేది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రతిపాదన. ఇదే అంశమై తాజాగా హైదరాబాద్ లో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి చర్చించారు. వీలైనంత తక్కువ భూసేకరణతో, తక్కువ నష్టంతో ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలనే అంశంపై చర్చించారు. ఈ ప్రతిపాదన తెర మీదికి వచ్చిన దగ్గర్నుంచీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రాలో రాయలసీమ ప్రాంతం మీద ప్రేమ కురిపిస్తున్నారు! అక్కడి కరువు పరిస్థితులు పోవాలని అంటున్నారు, మంచిదే. అయితే, మాటల్లో వ్యక్తమౌతున్న ఈ ప్రేమ… చేతల్లో కనిపిస్తోందా అనేది చర్చనీయాంశం.
ఒక్కసారి విభజన చట్టాన్ని చూసుకుంటే… దాన్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్థావనే లేదు. కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులగా ఉన్న కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం కృష్ణా వాటర్ బోర్డు అనుమతైనా ఉండాలి. కానీ, అవేవీ లేకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించేశారు. శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్లును తోడుకునే ప్రతిపాదనతో దీన్ని మొదలుపెట్టారు. ఇంకోటి, రాయలసీమ ప్రాంతం కృష్ణా పరీవాహక ప్రాంతంలో లేదు కాబట్టి, వెలుగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవాకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెరాస ప్రభుత్వం వాదనలు వినిపించింది. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు మూసేయాలని రాతపూర్వకంగా ట్రిబ్యునల్ కు వారే చెప్పారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రాంతానికి బచావత్ ట్రిబ్యునల్ ఎక్కువ నీటిని కేటాయించేసిందనీ, దాన్ని తగ్గించాలని కూడా కేసీఆర్ ప్రభుత్వం వాదించింది. ఆ నీటిని తెలంగాణకు ఇవ్వాలని అంటున్నారు. తాజాగా వరదల నేపథ్యంలో దాదాపు 350 టీఎంసీల నీళ్లు సముద్రం పాలౌతుంటే, ఆ వరద నీటి నుంచి పోతిరెడ్డిపాడుకు ఏపీ నీళ్లు తీసుకెళ్తే… ఈ నీటికి లెక్కలు చెప్పడం లేదంటూ ఏపీ సర్కారు మీద కృష్ణా వాటర్ బోర్డుకి ఫిర్యాదు చేశారు.
రాయలసీమను రతనాల సీమను చేసేందుకు సహకరిస్తామని కబుర్లు చెబుతున్న కేసీఆర్… వాస్తవంలో అడుగడుగునా సీమకు నీళ్లు వెళ్లే అవకాశాలపై వ్యవహరిస్తున్న తీరు వేరేలా ఉంది. ప్రెస్ మీట్లలో మాటలు వేరు… ప్రభుత్వ యంత్రాంగం పని వేరు. రాయలసీమ కరువు ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా, ఏపీ నీటి వనరుల వినియోగానికి భిన్నంగా కేసీఆర్ చేష్ఠలున్నాయి. ఇప్పుడు దాదాపు లక్ష కోట్లతో… తెలంగాణ గడ్డ మీద నుంచే కాలువలు వేసుకుని, ఎత్తిపోతల ద్వారా ఉభయులం నీటిని వాడుకుందాం అంటున్నారు. దీని కోసం పెద్దమనుషుల ఒప్పందాలు చేసుకుందామనీ అంటున్నారు. అయితే, ఈ ఒప్పందాలను భవిష్యత్తులో ఉల్లంఘించరు అనే గ్యారంటీ ఏది..? ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులనే సక్రమంగా అమలు చేయని పరిస్థితి కనిపిస్తోంది. అలాంటిది రేప్పొద్దున్న ఎత్తిపోతలను అడ్డుకుంటే పరిస్థితి ఏంటనేది కూడా ఏపీ సర్కారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీమ ప్రాంతం మీద కేసీఆర్ మాటల్లో వినిపిస్తున్న ప్రేమ… వాస్తవంలో కనిపిస్తోందా అనేది చర్చ జరగాలి.