పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్, విద్యుత్ కేంద్రం పనులకు.. .అంచనా వ్యయం కన్నా… దాదాపుగా రూ. 700 కోట్లకు తక్కువకు చేసేందుకు మేఘా ఇంజినీరింగ్ వర్క్స్ ముందుకు వచ్చింది. ప్రభుత్వ పెద్దలు తాము ఎంత ఆదా చేస్తామో ముందు నుంచీ చెబుతున్నట్లుగానే అంత ఆదా చేసేందుకు మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ముందుకు వచ్చింది. అసలు పోలవరం హెడ్ వర్క్స్ పనులు.., ప్రస్తుతం చేస్తున్న ధరలకే గిట్టుబాటు కావని… కాంట్రాక్ట్ సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినప్పటికీ.. ఎందుకు మేఘా సంస్థ.. ఇంత డిస్కౌంట్ ఇచ్చి.. రంగంలోకి దిగింది..? దీనికి ప్రతిఫలాన్ని ఎక్కడ పొందబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
“మేఘా” అంత తక్కువకు పనులెలా చేస్తుంది..?
పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కడానికి ట్రాన్స్ట్రాయ్… దాదాపుగా 15 శాతం లెస్‌కు టెండర్ వేసింది. పనులు చేపట్టి.. చేతులెత్తేసింది. ఆ కారణంగా ట్రాన్స్ ట్రాయ్ దివాలా స్థితికి చేరింది. ఆ పనులూ.. ఇతర కాంట్రాక్టర్లతో చేయించుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు మేఘా ఇంజినీరింగ్ ఆ పనుల్లోనే మరో 12 తగ్గింపునకు చేస్తానని ముందుకు వచ్చింది. ఇది అసాధ్యమమని.. చిన్న ఇల్లు కట్టుకున్న అనుభవం ఉన్న వారికైనా… తెలిసిపోతుంది. ఓ చిన్న ఇంటి నిర్మాణాన్ని కొన్నాళ్లు ఆపేసి..మళ్లీ ప్రారంభించాలంటే.. అంతకు మించి ఖర్చవుతుంది. అలాంటిది కాంట్రాక్టర్ ను మారిస్తే.. క్వాలిటీకీ గ్యారంటీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో.. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ.. ఇంత తక్కువ మొత్తంలో పనులు ఎలా చేస్తుందనేది.. కాంట్రాక్టుల రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసక్తి కలిగిస్తోంది.
కాళేశ్వరంకు రివర్స్ టెండరేస్తే… అంత కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుందా..?
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ .. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్ని చేపడుతోంది. ముఖ్యంగా.. తెలంగాణలో ఉన్న అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్ని కూడా నిర్మిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానాన్ని కూడా పొందారు.. మేఘా సంస్థ యజమానికి కృష్ణారెడ్డి. ఖమ్మంలో ఓ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసినందుకు సన్మానం కూడా చేశారు కేసీఆర్. ఇక కాళేశ్వరంలో కీలక ప్యాకేజీలన్నీ మేఘా సంస్థనే చేస్తోంది. అక్కడ.. క్యూబిక్ మీటర్‌కు.. రూ. ఐదు వేల పైనే… మేఘా సంస్థ చార్జ్ చేస్తోందని మీడియాలోనే ప్రచారం జరుగుతోంది. అదే.. పోలవరం వచ్చే సరికి.. నవయుగ కంపెనీ రూ. మూడు వేల ఐదు వందల లోపే.. క్యూబిక్ మీటర్ చార్జీని వసూలు చేస్తోందంటున్నారు. అంటే.. మేఘా సంస్థనే కాళేశ్వరం కోసం ఎక్కువ వసూలు చేస్తోంది. ఇప్పుడు.. రివర్స్ టెండర్ల పేరుతో.. పోలవరం పనులు చేయడానికి అంత కంటే.. తక్కువకే టెండర్ వేసింది. దీన్ని బట్టి చూస్తే అయితే.. కాళేశ్వరంలో అత్యధికంగా అయినా మేఘా సంస్థ కోట్ చేసి ఉండాలి.. లేకపోతే.. వేరే ప్రయోజనాలు పొందేలా.. ఏపీ సర్కార్ తో మాట్లాడుకుని… పోలవరాన్ని ఆ ధరలకు చేయడానికి అంగీకరించి ఉండాలని.. అంచనా వేస్తున్నారు.
ఏపీ సర్కార్ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు హడావుడికి.. మేఘాకి లింకేంటి..?
మేఘా ఇంజినీరింగ్ కే పోలవరం పనులు దక్కబోతున్నాయని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగుతోంది. సబ్బం హరి లాంటి నేతలు.. ముందుగానే ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. నష్టానికే తీసుకుంటారని.. అయితే.. ఇతర ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో ఆ నష్టం భర్తీ చేస్తారని అంటున్నారు. మేఘా సంస్థ ఇటీవల ఎలక్ట్రిక్ బస్సుల తయారీ రంగంలోకి వచ్చింది. ఓ సంస్థను టేకోవర్ చేసి.. దాన్ని.. చైనా కంపెనీతో కలిపి… ఎలక్ట్రిక్ బస్సుల తయారీ రంగంలోకి మేఘా కృష్ణారెడ్డి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి ఏపీ సర్కార్ నుంచి.. ఎలక్ట్రిక్ బస్సుల ప్రస్తావన అధికంగా వస్తోంది. తిరుమలలో 400 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడతామని.. ఏపీ ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనబోతున్నామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ రెండింటింకి సారూప్యత ఉందంటున్నారు. బస్సుల కాంట్రాక్ట్, కంపెనీల నెట్ వర్త్ పెంచడం.. వంటి క్విడ్ ప్రో కో తరహా చర్యలతో మేఘా నష్టాలను.. జగన్ భర్తీ చేయవచ్చనేది.. ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ముందు ముందు వీటిల్లో నిజాలు బయటకు తేలే అవకాశం ఉంది.