శ్రీవారి ఆలయంలోకి మళ్లీ ప్రధాన అర్చకుడిగా రావాలని రమణదీక్షితులు జగన్ని నమ్ముకుని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తొలి బోర్డు మీటింగ్ లో రమణదీక్షితులు అంశాన్ని లైట్ తీసుకున్నారు. ప్రధానార్చకునిగా.. తిరుగులేని స్థానంలో ఉన్న సమయంలో.. ప్రభుత్వంపై.. విమర్శలు చేసి.. టీటీడీ ప్రతిష్టకు సైతం మచ్చ పడేలా.. రాజకీయ విమర్శలు చేసిన రమణదీక్షితులకు.. అప్పటి ప్రభుత్వం రిటైర్మెంట్ ఇచ్చేసింది. అయితే.. కొత్త ప్రభుత్వం వచ్చాక.. ఆయనకు అన్ని విధాలా న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ గెలిచిన వెంటనే రమణదీక్షితులు వెళ్లి.. ఇడుపులపాయలో జగన్ ను కలిశారు. ఆయన కూడా భరోసా ఇచ్చి పంపారు. కానీ ఇప్పుడు మాత్రం.. వ్యవహారం కోర్టులో ఉందని.. ఏమీ చేయలేమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
రమణదీక్షితులను మళ్లీ.. ఆయన ప్రధాన అర్చకుడ్ని చేస్తామని గతంలో వైసీపీ ప్రకటించింది. దాంతో.. వైసీపీ గెలిచినప్పటి నుంచి.. రమణదీక్షితులు మళ్లీ.. టీటీడీలోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ తీసుకోలేదు. తొలి బోర్డు మీటింగ్ కోసం.. రమణదీక్షితులు కూడా ఎదురు చూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. పోలవరం వంటి విషయాన్ని కోర్టుల్ని సైతం లెక్క చేయని జగన్.. తన విషయంలో.. చిన్న జీవో జారీ చేసినా.. పనైపోతుందని.. కానీ చేయడం లేదని… రమణదీక్షితులు ఆవేదనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి రమణదీక్షితులను తొలగించిన తరువాత ఆ స్థానంలో వారి కుటుంబానికి చెందిన వారినే నియమించింది అప్పటి ప్రభుత్వం. ఖాళీగా వున్న అర్చక పోస్టులలో కూడా మీరాశి వంశీకులను అర్హత పరిక్ష ఆధారంగా నియమించేశారు. రమణదీక్షితులతో పాటు రిటైర్మెంట్ ప్రకటించిన నలుగురు ప్రధాన అర్చకులను తిరిగి టీటీడీలోకి తీసుకరావాలి అంటే మరో నలుగుర్ని తొలగించాలి. అలా తొలగిస్తే న్యాయపరంగా చిక్కులు వస్తాయి.
మరో వైపు గతంలో టీటీడీపై రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అప్పటి పాలకమండలి టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దీక్షితులతో పాటు విజయసాయి రెడ్డి పై పరువు నష్టం దావా వేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో వుంది. రమణదీక్షితులను ఇప్పటికిప్పుడు ప్రధాన అర్చకుడి హోదాలో తిరిగి తీసుకోవడం సాధ్యమయ్యేది కాదని టీటీడీ న్యాయవర్గాలు కూడా చెబుతున్నాయి. మధ్యే మార్గంగా రమణదీక్షితులను శ్రీవారి ఆలయంలోకి రప్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. కానీ ఇప్పుడు ఈ విషయంపైనా దృష్టి పెట్టడం లేదంటున్నారు.