మన్మథుడుతో ఓ భారీ డిజాస్టర్ ఇచ్చాడు నాగార్జున. ఈ సినిమా రిజల్ట్ నాగ్ని బాగా ఇబ్బంది పెట్టింది. నాగ్ ఇలాంటి కథల్ని ఎంచుకున్నాడేంటి? కథల విషయంలో నాగార్జున జడ్జిమెంట్ ఇలా తయారైందేంటి? అంటూ విమర్శలు వినిపించాయి. అందుకే తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నిజానికి `బంగార్రాజు` ఈపాటికే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ.. స్క్రిప్టు విషయంలో రాజీ పడని నాగ్ – పలు మార్పులూ చేర్పులూ సూచించడంతో ఆ పని ఇంకా జరుగుతూనే ఉంది. ఈలోగా ఓ కొత్త దర్శకుడికి నాగ్ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
సాల్మాన్ అనే ఓ దర్శకుడు ఇటీవల నాగ్‌కి ఓ కథ వినిపించినట్టు టాక్. భరత్ అనే నేను, మహర్షి సినిమాలకు ఇతను సహాయకుడిగా పనిచేశాడు. ఆ కథ నాగార్జునకు నచ్చిందని తెలుస్తోంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. నవంబరులో ఈసినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. దీని తరవాతే బంగార్రాజు మొదలవుతుందట. అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానున్నదని సమాచారం.