వైసీపీ హిట్ లిస్ట్‌లో .. ఉన్న టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణకు ఏపీ సర్కార్ సిఫార్సు చేసింది. సీబీఐని ఏపీలో కేసులు చేపట్టేందుకు అవసరమైన జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరించింది. అలా చేసిన తర్వాత తొలి కేసు టీడీపీ నేతపైనే పెట్టబోతున్నారు. గురజాల నియోజకవర్గంలోని నడికుడి, కోనంకి, కేశానుపూడి గ్రామాల్లో అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు జరుపుతున్నారంటూ. 2015లో కొంత మంది వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్రమ తవ్వకాలను.. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులే చేపడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని. జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే.. దాన్ని అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వతా వైసీపీ నేతలు దీనిపై మరో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు .. అధికారులపై సీరియస్ అయింది. దీనిపై గతంలో విచారణ జరిపిన ప్రభుత్వ అధికారులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కానీ వారు కూలీలని ..అసలు వ్యక్తుల్ని వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి.
కోర్టు సీబీసీఐడీ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో… సీబీఐకి ఇస్తున్నామని ఏపీ సర్కార్ తెలిపింది. ఈ మేరకు… కేసును సీబీఐకి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సరస్వతీ భూముల విషయంలో రైతులకు అండగా ఉన్నందుకే జగన్ తనపై కక్ష కట్టారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. సీబీఐ అధికారులను ఉరకుక్కలని దూషించిన నాయకులు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కు సిఫార్సు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.