పార్లమెంటు ఎన్నికలు జరిగిన తరువాతి నుంచి రాజకీయంగా యాక్టివ్ గా లేరు మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి కుమార్తె కె. కవిత. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఆ తరువాత, పార్టీ ఓటమిపై సమీక్ష కూడా ఆమె చెయ్యలేదు. చివరికి, ఆ మధ్య తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొనలేదు. సొంత నియోజక వర్గం నిజామాబాద్ వైపు కన్నెత్తి కూడా ఆమె చూడలేదు! ఎమ్మెల్సీని చేసి కేబినెట్ క పంపిస్తారనే చర్చ కొన్నాళ్లు జరిగితే, రాజ్యసభకు పంపించాలనే సీఎం కేసీఆర్ ఉన్నారనే కథనాలు వచ్చాయి. ఏదేమైనా ఎన్నికల తరువాత నుంచి ఆమె కామ్ గా ఉంటున్నారు. పార్టీ తరఫున ఇంతవరకూ ఆమె మాట్లాడిందీ లేదు, మీడియా ముందుకొచ్చి స్పందించిందీ లేదు. ఇప్పుడు బతుకమ్మ సంబరాలను జన జాగృతి తరఫున నిర్వహించేందుకు ఆమె సిద్ధమౌతున్నారు.
చాన్నాళ్ల తరువాత ఓ మీడియా ప్రకటనలో కవిత మాట్లాడుతూ… సెప్టెంబర్ 28 నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమౌతాయనీ, అక్టోబర్ 6న సద్దుల బతుకమ్మలతో ఈ సంబరాలు ముగుస్తాయన్నారు. ప్రతీ సంవత్సరం మారిదిగానే ఈ ఏడాది కూడా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో పండుగ జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు, విదేశాల్లో కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
బతుకమ్మలతో మరోసారి యాక్టివ్ అవుతున్నారు కవిత. అయితే, ఈ పండుగకే పరిమితం అవుతారా… ఆ తరువాత, రాజకీయంగా కూడా క్రియాశీలంగా మారే ప్రయత్నాలు చేస్తారా అనేది వేచి చూడాలి. ఈ పండుగ విషయానికొస్తే… రాష్ట్రంలో భాజపా కూడా ఈ సంబరాలకు సిద్ధమౌతోంది. కేంద్ర మహిళా మంత్రుల్ని అతిథులుగా రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నంలో వారున్నారు. బతుకమ్మల సెంటిమెంట్ తెరాసకు రాజకీయంగా బాగా కలిసొచ్చింది. అదే బాటలో భాజపా కూడా ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది బతుకమ్మల ఉత్సవాలను ఘనం నిర్వహించాల్సిన అవసరం రాజకీయంగా తెరాసకు అవసరమనే చెప్పాలి. కాబట్టి, కవిత మరింత క్రియాశీలం కావాల్సిన అవసరముంది. లోక్ సభ ఎన్నికల ఓటమి నుంచి ఇకనైనా తేరుకుంటారా, దీనికి కొనసాగింపుగా రాజకీయంగా మరింత క్రియాశీలం అవుతారా అనేది చూడాలి.