కేంద్ర ప్రభుత్వం అమితాబ్ బచ్చన్ కు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు గా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. దీంతో బాలీవుడ్ నుండే కాకుండా దేశంలోని సినీ ప్రముఖులు అందరి నుండి అమితాబ్ బచ్చన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ పేరు మీద ప్రెస్ నోట్ విడుదల చేస్తూ అమితాబ్ బచ్చన్ కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మరొక కలికితురాయి అంటూ కొనియాడారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీీ హ్యాండిల్ నుండి ట్వీట్ చేస్తూ, ‘సుప్రసిద్ధ నటులు శ్రీ అమితాబ్ బచ్చన్గారిని దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందనే వార్త నాకెంతో సంతోషాన్ని కలిగించింది. అలుపెరుగని కెరటంలాంటి వారి నట జీవితం గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం. నటనలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్నారు. అమితాబ్‌గారి కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఓ కలికితురాయి. వారికి నా తరపున, జనసైనికుల తరపున హృదయపూర్వక అభినందనలు. అన్నయ్య చిరంజీవిగారు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’లో కీలకపాత్రలో అమితాబ్‌గారు నటించిన సందర్భంలో సెట్లో కలిశాను. ఎంతో హుందా అయిన వారి వ్యక్తిత్వం, స్నేహపూర్వకంగా పలకరించిన తీరు మరిచిపోలేనివి’ అని రాసుకొచ్చారు.
ఏది ఏమైనా భారతదేశ సినీపరిశ్రమలో లివింగ్ లెజెండ్ లా ఉంటూ అనేక వైవిధ్యభరిత పాత్రలు చేసిన అమితాబ్ బచ్చన్ కి దక్కడంతో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రతిష్ట పెరిగిందని కూడా చెప్పవచ్చు.