తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో… టీటీడీ మీద.. చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. తవ్వకాలన్నారు. పింక్ డైమండ్ అన్నారు. శ్రీవారి సంపదను దోచేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే అన్నీ విచారిస్తామన్నారు. కానీ చివరికి.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల తర్వాత అవన్నీ ఉత్తదేనంటున్నారు. ప్రస్తుతం తిరుమలను అన్యమత వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో పాత వివాదాలన్నీ బయటకు వస్తున్నాయి. వాటి సంగతేమయిందని.. ప్రస్తుత పాలకుల్ని ఆరా తీస్తే.. అవన్నీ అబద్దాలని చెబుతున్నారు.
పింక్ డైమండ్ లేనే లేదంటున్నారు..! మరి అప్పుడెందుకు అలా..?
అప్పట్లో శ్రీవారి ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు… చెన్నై, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి.. పింక్ డైమండ్ మిస్ అయిందని ప్రకటించారు. దీనిపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సరిగ్గా ఎన్నికల ముందు ఈ విషయాన్ని తెరపైకి తీసుకురావడంతో రాజకీయ దుమారమే రేగింది. తిరుమల శ్రీవారికి మైసూర్ మహారాజు కానుకగా ఇచ్చిన గులాబి వజ్రాన్ని దేశం దాటించారని తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీవారి వజ్రాన్ని కొట్టేశారా? పింక్ డైమండ్ కథ కంచికేనా అంటూ పెద్ద రచ్చ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అటు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇష్టంగా తెచ్చి పెట్టిన జేఈవో ధర్మారెడ్డి కూడా తిరుమల శ్రీవారి ఆభరణాల్లో అసలు పింక్ డైమండ్ లేనే లేదని తేల్చి చెప్పారు. అసలు పింక్ డైమండ్ అనేది 1952 నుంచి లేదన్నారు. తొలిసారి 1952లో ఆభరణాల జాబితా తయారు చేశారు. పింక్ డైమండ్ అనేది లేదని అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ అప్పుడు ఆయన బయటకు చెప్పలేదు. అప్పటి ప్రభుత్వంపై ఆయనకు కోపం కాబట్టి.. ఈ వివాదాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఇలా అందరూ.. శ్రీవారిని ఆభరణాల విషయంలో రాజకీయం చేశారు. ఇప్పుడు తమ సర్కారే ఉంది కాబట్టి… అదంతా అబద్దమేనంటున్నారు.
పోటులో తవ్వకాలు జరిగే చాన్సే లేదట..! మరి అప్పుడెందుకు రచ్చ..!?
ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తిరుమలలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే శ్రీవారి పోటులో రహస్యంగా తవ్వకాలు జరిపారని కూడా రమణదీక్షితులు ఆరోపించారు. అయితే ఇది కూడా రాజకీయ దురుద్దేశంతో జరిగిన రచ్చే అని ఆ తర్వాత తేలిపోయింది. ఈ విషయాన్ని ధర్మారెడ్డి స్పష్టం చేశారు కూడా. వకుళమాత పోటులో 15 నుంచి 20 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. అలాంటి చోటు నుంచి నేలమాళిగల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి గుప్తనిధులను తరలించడం సాధ్యమేనా అని ఆయన అంటున్నారు. అక్కడ సీసీ కెమెరాల నిఘా ఎప్పుడూ ఉంటుంది..ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని తేల్చేశారు.
చంద్రబాబు ఇంటి కింద తవ్వితే శ్రీవారి నగలు దొరుకుతాయన్నారే..!?
ఇక లోక్సభ ఎన్నికలకు ముందు రోజు రాత్రి 400 కోట్లకు పైగా విలువచేసే 1,381 కిలోల బంగారం తరలింపు వ్యవహారం ఓ కుదుపు కుదిపేసింది. టీటీడీ డిపాజిట్ చేసిన బంగారం.. మెచ్యూరిటీ తీరిన సందర్భంగా తిరిగి ఇచ్చేందుకు తీసుకు వస్తున్న కారును ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. బంగారం తరలింపుతో టీటీడీకి సంబంధం లేదని.. బ్యాంక్ వారు తీసుకొచ్చి..శ్రీవారి ఖజానాలో జమ చేసిన తర్వాతే లెక్క వస్తుందన్నారు. చంద్రబాబే బంగారం తరలించారన్నట్లుగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు విమర్శలు చేశారు. చంద్రబాబు ఇంటి కింద తవ్వితే..శ్రీవారి నగలన్నీ బయట పడతాయని కూడా చాలెంజ్ చేశారు. అప్పటి సీఎస్ విచారణకు ఓ కమిటీ కూడా వేసేశారు. అధికారంలోకి చేతిలోకి వచ్చాక.. మాత్రం సైలెంటయిపోయారు.