” నేను ఆ సామాజికవర్గాన్ని టార్గెట్ చేశా. వారికి సంబంధించిన ఫలానా కంపెనీల్ని దివాలా తీయించేవరకూ ఎవరి మాటా వినను..?” అని గుజరాత్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్తకు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పత్రికలో రాశారు. అందులో ఎంత నిజం ఉందో కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది పారిశ్రామికవేత్తలకు మాత్రం .. జగన్మోహన్ రెడ్డి సర్కార్… చుక్కలు చూపిస్తోంది. సాక్షి పత్రికలో… విపరీతమైన రాతలతో పాటు ప్రభుత్వ పరంగా.. మానసికంగా వేదించడానికి చేయాల్సిందంతా చేస్తోంది. ఈ జాబితాల్లో .. లింగమనేని కుటుంబం కూడా చేరింది. ఆయన తన మనోవేదన.. ముఖ్యమంత్రి తీరు.. అధికారుల దుందుడుకు చర్యలను వివరిస్తూ.. నేరుగా సీఎంకే లేఖ రాశారు. ఇప్పుడా లేఖ కలకలం రేపుతోంది.
ఏ సీఎం అడిగినా ఇల్లు అద్దెకు ఇచ్చేవాడిని..!
కరకట్టపై ఉన్న తన నివాసం దగ్గర సీఆర్డీఏ అధికారులు చేస్తున్న హడావుడి ఆందోళనకు గురిచేస్తోంది… 2014లో సీఎం నివాసానికి అనుకూలంగా ఉంటుందని అధికారులు కోరితే.. నా అతిథి గృహాన్ని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చేందుకు ఒప్పుకున్నానన్నారు. సీఎంగా ఎవరు ఉన్నా… ఇచ్చే వాడిననని లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. నా నిర్ణయం వెనుక రాజకీయ, ఆర్ధిక ప్రతిపాదనలు లేవని.. బాధ్యత గల పౌరుడిగా దీనికి అంగీకరించానన్నారు. అప్పటి సీఎంకు ఇంటిని అద్దెకు ఇచ్చినందున నేను ఆయనకు బినామీనని… అవాస్తవాలు ప్రచురించి ఆవేదనకు గురిచేశారని లింగమనేని రమేష్ లేఖలో తెలిపారు. కరకట్ట నివాసానికి ఉండవల్లి పంచాయతీ, కృష్ణా సెంట్రల్ డివిజన్ ఏఈ, ఇరిగేషన్ అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకున్నానని… ఇల్లు కట్టేటప్పటికి ఉన్న వ్యవస్థల నుంచి అనుమతులు తెచ్చుకున్నానని గుర్తు చేశారు. 2014 తర్వాత తాను ఒక్క ఆస్తినీ కొనలేదని స్పష్టం చేశారు.
మా ఆస్తులపై సీఎంకు కొత్తగా తెలియాల్సినవి ఏమీ లేవు..!
లింగమనేని వ్యాపార సంస్థలకు చెందిన ఆస్తులపై విచారణ జరపాలని… ఏ మాత్రం లొసుగులు ఉన్నా.. వదిలి పెట్టవద్దని.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారట. ఇదే విషయాన్ని లింగమనేని రమేష్.. తన లేఖలో స్పష్టం చేసి.. మొత్తం తన వ్యాపారాల గురించి లేఖలో వివరించారు. వైఎస్ హయాంలో మొదలైన తమ వ్యాపార ప్రస్థానం గురించి.. ఏ పార్టీతోనూ తమకు సంబంధం లేని వైనాన్ని… తెలిపారు. నేను కొత్తగా మీకు తెలియజేయాల్సింది..నేను దాచిపెట్టింది ఏమీ లేదని లింగమనేని రమేష్ సూటిగానే జగన్ కు చెప్పారు. కొద్ది రోజుల నుంచి ఏపీలోని రెవిన్యూ అధికారులు.. టార్గెట్ చేసిన కొంత మంది టీడీపీ నేతలు, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖుల ఆస్తులపై రహస్య విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు.. ఏమైనా బినామీలు ఉన్నారా..అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి.. లింగమనేనిపై కూడా విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
కూల్చివేతలతో ఎలాంటి పరిస్థితులు తెచ్చి పెట్టారో తెలుసా..?
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కూల్చివేతల కారణంగా ఏర్పడుతున్న భయానక పరిస్థితుల్ని లింగమనేని.. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని లక్షల మందికి మనోవేదన కలిగిస్తున్నారని.. సూటిగానే చెప్పారు. కోస్తా ప్రాంతం పై ఉన్న ఇష్టం.. గుంటూరు, విజయవాడలను మహానగరాలుగా చూడాలనుకునే అ ప్రాంత వాసిగా.. ప్రస్తుత పరిస్థితులు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే.. పారిశ్రామికవేత్తల్లో.. భరోసా కల్పించాలి కానీ.. ఒత్తిళ్లు, కూల్చివేతల వల్ల.. ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. లింగమేని లేఖ ఘాటుగానే ఉంది. ఏపీలో ఓ వర్గం పారిశ్రామికవేత్తలపై పెరుగుతున్న ఒత్తిళ్ల విషయంలో… తిరుగుబాటుకు సూచికలాగా.. ఆ లేఖ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
[pdf-embedder url=”https://www.telugu360.com/te/wp-content/uploads/sites/2/2019/09/Lingamaneni.pdf”]